ఆకలి తీర్చలేక 8మందిని నరికేశాడు

by Swamyn |
ఆకలి తీర్చలేక 8మందిని నరికేశాడు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్యాపిల్లలను పోషించలేక ఓ వ్యక్తి వాళ్లందరినీ నరికిచంపాడు. మృతుల్లో నిందితుడి భార్యతోపాటు ఏడుగురు పిల్లలు ఉన్నారు. వివరాల్లోకెళ్తే, పంజాబ్ ప్రావిన్సులోని ముజఫర్ జిల్లాకు చెందిన సజ్జద్ ఖోఖర్ అనే వ్యక్తి రోజువారి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. అతనికి భార్య, ఏడుగురు పిల్లలున్నారు. పిల్లలంతా 8నెలల వయసు నుంచి పదేళ్లలోపువారే. కొంతకాలంగా వారి కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గొడవలు తరచూ జరుగుతుండటంతో కోపోద్రిక్తుడైన సజ్జద్.. భార్య కౌసర్(42)తోపాటు తన నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులను గొడ్డలితో నరికిచంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం అలిపూర్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో నేరాన్ని ఒప్పుకున్న సజ్జద్.. ఇకపై తన పిల్లల ఆకలి తీర్చలేననే కారణంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపాడని పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అక్కడి పంజాబ్ సీఎం మరియం.. ఐజీ నుంచి నివేదికను కోరారు. కాగా, పాక్‌ను తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న విషయం తెలిసిందే.


Advertisement

Next Story