శరణార్థులపై సైనికుల కాల్పులు.. ఆరుగురు మృతి

by Y.Nagarani |
శరణార్థులపై సైనికుల కాల్పులు.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ట్రక్కులో పారిపోతున్న శరణార్థులపై మెక్సికో సైనికులు కాల్పులు జరిపారు. గ్వాటెమాలా సరిహద్దులో వెళ్తున్న ఓ ట్రక్కుపై సైనికులు కాల్పులు జరుపగా.. ఆరుగురు శరణార్థులు (migrants) మరణించారని మెక్సికో రక్షణశాఖ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈజిప్ట్, నేపాల్, క్యూబా, భారత్, పాకిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ట్రక్కుపై సైనికులు కాల్పులు జరిపారు. ట్రక్కులో ఉన్నవారిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 10 మందికి గాయలైనట్లు సమాచారం.

కాల్పుల సమయంలో ట్రక్కులో మొత్తం 33 మంది వలసదారులు ఉన్నట్లు గుర్తించారు. మరణించినవారు, క్షతగాత్రులు మినహా.. 17 మంది సురక్షితంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ట్రక్కుపై కాల్పులు జరిపిన ఇద్దరు సైనికుల్ని విధుల సస్పెండ్ చేసి, వారిపై విచారణకు ఆదేశించినట్లు మెక్సికో సైనిక చీఫ్ పేర్కొన్నారు.

శరణార్థులతో వెళ్తున్న వాహనంపై మెక్సికో సైన్యం కాల్పులు జరపడం ఇదే తొలిసారి కాదు. 2021లో వలసదారులను తీసుకు వెళ్తోన్న పికప్ ట్రక్కుపై క్వాసీ - మిలిటరీ నేషనల్ గార్డ్ కాల్పులు జరుపగా.. ఒకరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సైన్యంపై వారు కాల్పులు జరపడంతోనే.. తిరిగి వారిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. కానీ.. అది అసాధ్యమని, వీలైనంతవరకూ వలసదారులు లంచాలు ఇచ్చి ఆశ్రయం పొందేందుకు చూస్తారని వలసహక్కుల కార్యకర్త ఇరినియో ముజికా తెలిపారు.

Next Story

Most Viewed