జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజహర్ మృతి?

by Hajipasha |   ( Updated:2024-01-01 12:08:09.0  )
జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజహర్ మృతి?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాక్ గడ్డపై కరుడుగట్టిన ఉగ్రవాదుల అనుమానాస్పద మరణాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌(55) గుర్తు తెలియని వ్యక్తుల బాంబు దాడిలో చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. అతడు సోమవారం ఉదయం భవల్‌పూర్‌ మసీదు నుంచి తిరిగి వెళ్తుండగా కొందరు దుండగులు అతడిపై బాంబు విసిరినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనికి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

ఎవరీ మసూద్ అజహర్ ?

పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో విద్యావంతుల కుటుంబంలో అజహర్‌ పుట్టాడు. కశ్మీర్‌ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. 1994లో అజహర్‌ ఫేక్‌ ఐడీ మీద శ్రీనగర్‌కు చేరుకున్నాడు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రత బలగాలు ఫిబ్రవరిలో అనంతనాగ్‌ జిల్లా ఖానాబల్‌ దగ్గర అజహర్‌ను అరెస్ట్‌ చేశాయి. అప్పటి నుంచి పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. భారత్‌లోని జైలులో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు.. ఇంటర్‌పోల్‌ సైతం ఇతగాడిని ప్రశ్నించాయి. అయితే భారత్ అజహర్‌ విడుదల కోసం ఉగ్రవాదులు ఏకంగా విమానాన్నిహైజాక్‌ చేశారు. 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ జరిగింది ఇతడి కోసమే. కాందహార్‌ హైజాక్‌ ఘటన భారత్‌కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.

కాందహార్ హైజాక్

1999 డిసెంబర్‌ 24న మసూద్‌ అజహర్‌ సానుభూతి పరులు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 814ను హైజాక్‌ చేసి కాందహార్‌కు తరలించారు. ఆ సమయంలో కాందహార్‌ పాక్‌ ఐఎస్‌ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్య పరమైన చర్చలు విఫలం కావడంతో.. అప్పటి భారత ప్రభుత్వం అజహర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్‌ భల్వాల్‌ జైలు నుంచి అప్పటి పోలీస్‌ అధికారి శేష్ పాల్ వైద్ నేతృత్వంలో 1999 డిసెంబర్‌ 31న అజహర్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్‌ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహర్ పాక్‌ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్‌ మాత్రం అజహర్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ వచ్చింది. దీంతో విమానంలోని మిగతా ప్రయాణికులను ఉగ్రవాదులు అప్పగించారు. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జేషే మహమ్మద్‌ సంస్థను స్థాపించింది అజహారే. 2019 మే 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

Advertisement

Next Story