Israel: డమాస్కస్‌, గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 25 మంది మృతి

by vinod kumar |
Israel: డమాస్కస్‌, గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 25 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం నిరంతరం పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ భద్రతా బలగాలు సిరియా రాజధాని డమాస్కస్‌పై వైమాణిక దాడులతో విరుచుకుపడ్డాయి. డమాస్కస్‌లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టినట్టు పలు కథనాలు వెల్లడించాయి. మరోవైపు లెబనాన్ సరిహద్దు గ్రామం లాబౌనే సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు హిజ్బుల్లా లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు.

గాజాలో శరణార్థి శిబిరంపై అటాక్

గాజాపై అర్ధరాత్రి జరిగిన సైనిక దాడుల్లో సుమారు18 మంది మరణించారని పాలస్తీనా వైద్యులు బుధవారం తెలిపారు. జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయని, దీంతో వారంతా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుసిరత్ శరణార్థి శిబిరం సమీపంలో జరిగిన దాడిలోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మరణించారు. జబాలియా నుంచి హమాస్ తదుపరి దాడులను నియంత్రించడానికి ఈ అటాక్‌లకు పాల్పడినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లిపోవాలని సూచించింది. కాగా, గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 41,010 కి చేరుకోగా.. 97,720 మంది గాయపడ్డట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

సౌదీ అరేబియాకు ఇరాన్ విదేశాంగ మంత్రి

గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ దాడులను ముగించే చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ బుధవారం సౌదీ అరేబియాకు వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది. ఈ సందర్భగా మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ఆపడం, ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడం వంటి విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ‘ఇజ్రాయెల్ మారణహోమం ఆపడం, గాజా, లెబనాన్‌లోని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story