ఉక్రెయిన్ నిజంగా మీకు మిత్రదేశమేనా?.. నాటో కూటమిపై జెలెన్ స్కీ వ్యాఖ్యలు

by samatah |
ఉక్రెయిన్ నిజంగా మీకు మిత్రదేశమేనా?.. నాటో కూటమిపై జెలెన్ స్కీ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషణ్(నాటో) కూటమిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ మిత్రదేశమా కాదా అనే విషయాన్ని నాటో కూటమి నిర్ణయించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ దళాలకు ఆయుధాల పంపిణీని వేగవంతం చేయాలని నాటో సభ్య దేశాల రక్షణ మంత్రులను కోరారు. నాటో దేశాల రక్షణ మంత్రులతో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో జెలెన్ స్కీ ప్రసంగించారు. ఉక్రెయిన్ మిత్రపక్షమా కాదా అనే విషయంపై నాటో కూటమి స్పష్టత ఇవ్వాలన్నారు. రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను రక్షించడానికి మరింత సహాయం అవసరమని నొక్కి చెప్పారు.

పాశ్చాత్య దేశాల మద్దతు లేకుండా ఉక్రెయిన్ తనకు తాను రక్షించుకోలేదని స్పష్టం చేశారు. రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతోందని వాటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సామర్థ్యం పరిమితంగానే ఉందని తెలిపారు. రష్యా డ్రోన్, క్షిపణి దాడులను వేగవంతం చేసిన నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు నాటో చీఫ్ స్టోలెన్ బర్గ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు వాయు రక్షణతో సహా మరిన్ని ఆయుధాలను అందించడానికి నాటో కూటమి అంగీకరించిందని తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. కాగా, ఉక్రెయిన్ రష్యా నుంచి భీకర దాడులను ఎదుర్కొంటుంది. ఇటీవల చెర్నగివ్ నగరంపై జరిగిన దాడిలో 18మంది మరణించారు.

Advertisement

Next Story