Nobel Peace Prize 2023: జైల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్తకు నోబెల్..

by Vinod kumar |
Nobel Peace Prize 2023: జైల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్తకు నోబెల్..
X

స్టాక్ హోం: ప్రస్తుతం జైల్లో ఉన్న ఇరాన్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త నార్గిస్‌ మొహమ్మదిని నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నందుకుగానూ ఆమెను అవార్డుకు ఎంపిక చేశామని నార్వే నోబెల్‌ కమిటీ ఓస్లోలో ప్రకటించింది. ‘‘మహిళా హక్కుల కోసం నార్గిస్‌ మొహమ్మది చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు’’ అని తెలిపింది.

నార్గిస్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పలు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా పనిచేశారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిరీన్‌ ఇబాది స్థాపించిన డిఫెండర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (డీహెచ్‌ఆర్‌సీ) సెంటర్‌లో 2003లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో తొలిసారి ఇరాన్‌ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ ఆమె తొలిసారి అరెస్టయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత డీహెచ్‌ఆర్‌సీలో చేరినందుకు మరోసారి అరెస్టయ్యారు.

11 ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత..

2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో నార్గిస్ ను అరెస్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ ఆమె బెదరలేదు. రెండేళ్ల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన ఆమె.. ఇరాన్‌లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రపంచంలోనే ఎక్కువగా మరణశిక్షలను విధిస్తున్న దేశాల్లో ఇరాన్‌ ఒకటి. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆమెను 2015లో అరెస్టు చేసి జైలుకు పంపించారు.

2022 సెప్టెంబరులో హిజాబ్‌ ధరించనందుకు మాసా అనే యువతిని ఇరాన్‌ పోలీసులు అరెస్టు చేయగా కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలోనూ నార్గిస్‌ తన గళాన్ని వినిపించారు. జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపించారు. అలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్‌ టైమ్స్‌, బీబీసీ వంటి మీడియా సంస్థల్లో పబ్లిష్ అయ్యాయి.

ఈ ఏడాది 351 నామినేషన్లు వస్తే..

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 351 నామినేషన్లు వచ్చాయి. వీటిలో 259 మంది వ్యక్తులు, 92 సంస్థలు ఉన్నాయి. కానీ ఇరాన్‌‌లో మానవ హక్కుల ఉల్లంఘన నేపథ్యంలో నార్గిస్‌ మొహమ్మదిని ఎంపిక చేయడమే సమంజసమని నోబెల్ కమిటీ నిర్ణయించింది. 1901 నుంచి ఇప్పటి వ‌రకు 104 సార్లు నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ప్రక‌టించారు.ఇప్పటివరకు 19 మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అవార్డు ప్రక‌టించిన సమయంలో ఐదుగురు శాంతి బహుమతి గ్రహీతలు జైల్లో ఉన్నారు.

Advertisement

Next Story