ఇజ్రాయెల్‌పై దాడిలో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించింది: ఇరాన్ సుప్రీం లీడర్

by Harish |   ( Updated:2024-04-21 13:10:45.0  )
ఇజ్రాయెల్‌పై దాడిలో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించింది: ఇరాన్ సుప్రీం లీడర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ దేశం శక్తిని ప్రదర్శించిందని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆదివారం అన్నారు. "ఎన్ని క్షిపణులను ప్రయోగించాం, వాటిలో ఎన్ని వాటి లక్ష్యాన్ని చేరుకున్నాయి అనేది ప్రాథమిక ప్రశ్న కాదు, నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే ఆ ఆపరేషన్ సమయంలో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించింది" అని ఖమేనీ తెలిపారు. తన దేశ సైనిక అధికారులు నిరాటంకంగా సైనిక ఆవిష్కరణలను కొనసాగించాలని, శత్రువుల వ్యూహాలను అంచనా వేయడంలో ముందు ఉండాలని అన్నారు.

ఇటీవల ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ఇజ్రయెల్ కూల్చివేయడంతో రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఇరాన్ మొదటిసారిగా ఇజ్రయెల్‌పై ప్రత్యక్ష దాడికి దిగింది. ఏప్రిల్ 13న 300 కంటే ఎక్కువ క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. వీటిలో చాలా వాటిని ఇజ్రయెల్, దాని మిత్రదేశాలు కూల్చివేశాయి. దీని తరువాత శుక్రవారం తెల్లవారుజామున, ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంపై పేలుళ్లు సంభవించాయి. అయితే వీటిని ఇజ్రాయెల్ దళాలు చేసి ఉంటాయని అనుమానిస్తున్నారు.

అయితే ఈ దాడుల నేపథ్యంలో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం పాక్‌ను సందర్శించనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రితో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, అలాగే పెద్ద వ్యాపార ప్రతినిధి బృందం కూడా పర్యటనకు వస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed