భారత్ భిన్నమైన దేశం: జపాన్ పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్

by samatah |
భారత్ భిన్నమైన దేశం: జపాన్ పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ ఎజెండాను రూపొందించడంలో భారత్ భిన్నమైన దేశమని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఎంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జైశంకర్ టోక్యోలో గురువారం జరిగిన మొదటి రైసినా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘భారతదేశంలో జరుగుతున్న మార్పుల వేగాన్ని జపాన్ ప్రశంసించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండియాలో ప్రతిరోజూ 28 కిలోమీటర్ల హైవేని నిర్మిస్తున్నాం. అంతేగాక ప్రతి ఏటా 8 కొత్త విమానాశ్రయాలను సృష్టిస్తోంది. ప్రతి సంవత్సరం ఒకటిన్నర నుంచి రెండు మెట్రోలను ఏర్పాటు చేస్తోంది. గత 10 సంవత్సరాలుగా ప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలను నిర్మించింది’ అని వ్యాఖ్యానించారు. ఈ అభివృద్ధి భారత్‌ను మరింత ప్రభావవంతంగా, నమ్మకమైన భాగస్వామిగా చేస్తుందని తెలిపారు. వ్యాపారం చేయడం, సులభంగా జీవించడం, డిజిటల్ డెలివరీ, స్టార్టప్ లేదా అంతర్జాతీయ ఎజెండాను రూపొందించడంలో భిన్నమైన దేశంగా భారత్ ఉందని చెప్పారు. తూర్పు, పడమర రెండు ప్రధాన కారిడార్‌లపై భారత్ పనిచేస్తోందన్నారు.

ఇండియా-జపాన్‌ల బంధం ఎంతో ముఖ్యం

భారత్-జపాన్‌లు ఎంతో కాలంగా వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉన్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య సమన్వయం నిర్వహించడం ఎంతో ముఖ్యమైందని చెప్పారు. ‘ఆసియాలో రెండు శక్తులుగా స్వేచ్ఛ, పారదర్శకతతో నియమాలకు అనుగుణంగా ఉండటమే రెండు దేశాల లక్ష్యమని వెల్లడించారు. అనేక విషయాల్లో భారత్-జపాన్‌లు ఎలా మద్దతిస్తాయో మొత్తం ప్రపంచం చూస్తుందన్నారు. ఈ భాగస్వామ్యం మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. జపాన్ పర్యటనకు ముందు జైశంకర్ దక్షిణ కొరియాకు వెళ్లారు. అక్కడ పలువురు నేతలను కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed