అలా జరిగితే.. ఇమ్రాన్ పార్టీపై బ్యాన్ ?

by Hajipasha |
అలా జరిగితే.. ఇమ్రాన్ పార్టీపై బ్యాన్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రధానిగా ఉన్న టైంలో దేశ ఖజానాకు నష్టం చేకూర్చిన కేసు, భూకుంభకోణాలకు పాల్పడిన కేసు సహా ఇంకెన్నో కేసులు ఇమ్రాన్‌పై నమోదయ్యాయి. ఓ కేసులో జైలుశిక్ష పడటంతో ప్రస్తుతం ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు. మిగతా కేసుల్లో విచారణ ఇంకా కొనసాగుతోంది. మే 9న పాకిస్తాన్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇమ్రాన్ పాత్ర ఉందనే అభియోగాలతో ఇంకో కేసు నమోదైంది. 2022 సంవత్సరం మార్చి చివరివారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఓడిపోయింది. ఆనాడు ప్రభుత్వం కూలిపోయిన అనంతరం అమెరికా ప్రభుత్వం రాసిన ఓ అధికారిక లేఖను ఇమ్రాన్ చూపిస్తూ.. ‘‘అమెరికాకు ఎదురు తిరిగానని నా ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఈ కుట్రలో అమెరికా ప్రభుత్వం, పాక్ సైన్యం కలిసికట్టుగా పనిచేశాయి’’ అని ఆరోపించారు. ఈ రెండు కేసుల్లో త్వరలోనే తీర్పు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీటిలో ఇమ్రాన్ దోషిగా తేలితే.. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (పీటీఐ)ను బ్యాన్ చేసే అంశాన్ని పాక్ ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

Next Story