Sheikh Hasina : బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా అప్పగింతపై భారత్ కీలక స్పందన

by Hajipasha |
Sheikh Hasina : బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా అప్పగింతపై  భారత్ కీలక స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అప్పగింత అంశంపై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం హసీనాను అప్పగించమని కోరితే ఏం చేస్తారు అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం లౌక్యంగా బదులిచ్చారు. ‘‘అసలు అలాంటి ప్రశ్నే తలెత్తకపోవచ్చు. అదొక కల్పిత అంశం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఊహాజనిత అంశాలపై తాము స్పందించలేమని తేల్చి చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భద్రతా కారణాల రీత్యా హుటాహుటిన భారత్‌కు వచ్చారు. ఈవిషయాన్ని మేం గతంలోనే చెప్పాం. దీనిపై చెప్పడానికి ఇంకా ఏం లేదు’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అశాంతి కారణంగా కొన్ని ద్వైపాక్షిక ప్రాజెక్టులు ఆగాయని, అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడగానే అవి మొదలవుతాయన్నారు. బంగ్లాదేశ్‌లో వరదలకు భారత్ కారణం అంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. అందులోనూ బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులపై ప్రధాన చర్చ జరిగిందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed