పాకిస్థాన్‌కు అమెరికా షాక్..ఆ సంస్థలపై ఆంక్షలు!

by Dishanational2 |
పాకిస్థాన్‌కు అమెరికా షాక్..ఆ సంస్థలపై ఆంక్షలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టుకు సంబంధించిన సామగ్రిని సరఫరా చేస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇందులో బెలారస్‌కు చెందిన మీన్క్స్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్, చైనాలోని జియాన్ లాంగ్డే టెక్నాలజీ డెవలప్ మెంట్, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ అండ్ గ్రాన్ పెక్ట్ కంపెనీ లిమిటెడ్‌, గ్రాన్‌పెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేయడంలో సహాయపడుతున్నాయని యూఎస్ ఆరోపించింది. ప్రస్తుతం ఈ సంస్థలు పాక్ బాలిస్టిక్ క్షిపణి తయారీకి పలు వస్తువులను అందిస్తున్నాయి. విదేశాంగ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13382 సెక్షన్ ప్రకారం ఆంక్షలు విధించినట్టు వెల్లడించింది.

యూఎస్ ఆంక్షలు విధించిని కంపెనీల్లో బెలారస్‌కు చెందిన మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ పాకిస్తాన్ దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి ప్రత్యేక వాహన ఛాసిస్‌ను సరఫరా చేయడానికి సహాయపడుతోంది. అలాగే చైనాకు చెందిన టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ అండ్ గ్రాన్ పెక్ట్ కంపెనీ లిమిటెడ్‌,, రాకెట్ మోటారు తయారీకి కీలకమైన ఫిలమెంట్ వైండింగ్ మెషిన్ వంటి క్షిపణి సంబంధిత పరికరాలను అందించింది. అలాగే గ్రాన్‌పెక్ట్ కంపెనీ పాకిస్థాన్‌కు చెందిన సుపార్కోతో కలిసి పెద్ద వ్యాసం కలిగిన రాకెట్ మోటార్‌లను పరీక్షించడానికి పరికరాలను సరపరా చేస్తోంది. దీంతో తాజా అమెరికా ఆంక్షలో ఈ సరఫరా ఆగిపోనున్నట్టు తెలుస్తోంది.

దీనిపై అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ఈ కంపెనీలు పాక్‌కు క్షిపణుల తయారీలో సహకరిస్తున్నాయని తెలిపారు. ప్రమాదకరమైన కార్యకలాపాలను కలిగి ఉన్నాయని చెప్పారు. వీటిని నియంత్రించడానికి యేఎస్ వెనుకాడబోదని వెల్లడించారు. పాక్‌కు మిత్ర దేశంగా ఉన్న చైనా నిరంతరం పాకిస్థాన్ ఆయుధ ఆధునీకీకరణకు మద్దతిస్తూ రక్షణ పరికరాలను సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed