కరోనా కట్టడిలో దేశాధినేతలు వయా ఫేస్‌బుక్ పేజీలు

by sudharani |
కరోనా కట్టడిలో దేశాధినేతలు వయా ఫేస్‌బుక్ పేజీలు
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తుంటే తప్పుడు సమాచారం ఇంటర్నెట్లో తైతక్కలాడుతోంది. అయితే వాస్తవ సమాచారం కోసం అధికారిక పేజీలే దిక్కు. ఇక సరాసరి దేశాధినేతల అధికార పేజీలే ఫాలో అయితే… ఓ పని అయిపోద్దని అందరూ అనుకున్నారు. ఇంకేముంది ఒక్క నెలలో ఆయా పేజీల గ్రోత్ అమాంతం పెరిగిపోయింది.

బీసీడబ్ల్యూ గ్లోబల్ అనే కమ్యూనికేషన్స్ ఏజెన్సీ ఈ విషయం గురించి సర్వే చేసింది. మార్చి నెలలో దేశాధినేతల ఫేస్‌బుక్ హ్యాండిల్స్‌లో లైకులు, ఫాలోవర్ల సంఖ్య 3.7 శాతం పెరిగిందని తెలిపింది. గడచిన 12 నెలల వృద్ధిలో ఇది సగానికి కంటే ఎక్కువే. దాదాపు 721 దేశాధినేతలు, ప్రభుత్వాల అధికారిక పేజీలను విశ్లేషించి వారు నివేదిక రూపొందించారు. ముఖ్యంగా ఇటలీ, ఆస్ట్రియా, ఎస్తోనియా ప్రధానుల ఫేస్‌బుక్ పేజీలకు మార్చిలో లైకులు రెట్టింపు అయ్యాయి. కరోనా బారిన పడి తీవ్రంగా నష్టపోయిన ఇటలీలో ప్రధాని జియుసెప్పే కొంతే ప్రతి సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యేవారు.

ఇక అంతర్జాతీయ మీడియా ప్రశంసలు పొందుతున్న న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ క్రమం తప్పకుండా తన ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అయ్యేవారు. కేవలం ఇలాంటి ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే కాకుండా పేజీల్లో కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా షేర్ చేసి అవగాహన పెంచుతున్నారు. ఇంకా ఉక్రెయిన్ లాంటి కొన్ని దేశాలైతే ప్రత్యేకంగా కరోనాకు సంబంధించిన సమాచారం కోసమే పేజీలు క్రియేట్ చేశారు.

ఇక బీసీడబ్ల్యూ ట్విప్లోమసీ సిరీస్‌లో భాగంగా 2020 సంవత్సరానికి గాను వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్‌బుక్ పేరుతో విడుదల చేసిన నివేదికలో 189 దేశాల ప్రతినిధులు రెగ్యులర్‌గా ఫేస్‌బుక్ వాడుతున్నట్లు తెలిపింది. దాదాపు 95 శాతం ఐక్యరాజ్యసమితి దేశాలు ఫేస్‌బుక్‌లో ఉన్నట్లే. ఇక మన ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యక్తిగత పేజీకి 45 మిలియన్లకు పైగా లైకులు, పీఎంవో ఇండియా పేజీకి 13.7 మిలియన్ల లైకులతో అత్యంత పాపులర్ దేశాధినేతగా ప్రసిద్ధికెక్కారు. అయితే లాక్‌డౌన్ ప్రారంభమైన దగ్గరి నుంచి మిగతా దేశాల అధినేతలతో పోల్చితే మోదీ పెద్దగా ఇంటరాక్ట్ అవకపోయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఇక అతిగా ఇంటరాక్ట్ అయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా 309 మిలియన్ ఇంటరాక్షన్లతో టాప్ ర్యాంకింగ్‌లో నిలిచారు. ఈ ఇంటరాక్షన్ ఏమో గానీ పరిస్థితి మాత్రం రోజురోజుకీ దిగజారిపోతున్న సంగతి తెలిసిందే.

Tags: Corona, covid, world leaders, India, America, Italy, world leaders, survey

Advertisement

Next Story