TG Govt.: అన్నదాతలకు తీపికబురు.. రేపటి నుంచే అమల్లోకి ‘భూభారతి’

by Shiva |
TG Govt.: అన్నదాతలకు తీపికబురు.. రేపటి నుంచే అమల్లోకి ‘భూభారతి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతిని లాంచ్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. శిల్పారామంలో అధికారులు, మేధావుల మధ్య రేపు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అయితే కొత్త చట్టంపై అన్నదాతలకు అవగాహన కలిగేలా రైతుల మధ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీని ద్వారా కొత్తచట్టంపై విస్తృత ప్రచారం కలిగి అన్నదాతలతోపాటు ప్రభుత్వానికీ మేలు జరుగుతుందని గుర్తించాల్సిన అవసరముంది. ధరణిని తీసుకువచ్చినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుచింతలపల్లిలో రైతుల మధ్య గొప్పగా ఆవిష్కరించింది. చట్టం అమల్లోకి రాగానే గులాబీ కార్యకర్తలు ఊరూరా ఎండ్లబండ్లతో ర్యాలీలు తీశారు. అయితే ఇప్పుడు అన్నదాతల సమస్యలను పరిష్కరించేలా ఏడాదిన్నర కష్టపడి ప్రజామోదంతో తీసుకువస్తున్న ఆర్వోఆర్-2025 లాంచ్ ప్రోగ్రామ్ ను సాదాసీదాగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతాంగానికి నిరాశకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానాంశాల్లో ధరణి పోర్టల్ వైఫల్యం ఒకటి. అందుకే తమ భూములు ఎక్కడికీ పోవని ధైర్యం, నమ్మకం కల్పించేలా భూభారతి అమలుకు శ్రీకారం చుట్టాలని ధరణి బాధితులు కోరుతున్నారు.

ప్రచారంలో విఫలం

సన్నబియ్యం పంపిణీలో తప్పా.. ఇతర సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజ్యాంగం ప్రకారం అప్పీల్ వ్యవస్థ ఉండేలా తీసుకువస్తున్న భూభారతిపై ప్రచారంలో సైతం వెనకబడి ఉన్నామని కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ధరణికి, భూ భారతికి మధ్య తేడాలు ఏమేం ఉంటాయో కూడా జనానికి చేర్చకపోతే.. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలదే పైచేయి అవుతుందని చెబుతున్నారు. మళ్లీ పట్వారీలు వచ్చేశారంటూ బీఆర్ఎస్ చేసే ప్రచారానికి కౌంటర్ ఇవ్వలేకపోతే.. ఎందుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరమో అర్థమయ్యేలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

గొప్ప సభ.. ఫెయిల్యూర్ పోర్టల్

బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లిలో గొప్ప సభ ఏర్పాటు చేసి ధరణిని ఆవిష్కరించారు. 60 లక్షల మంది రైతుల వివరాలు పోర్టల్ లో నమోదయ్యాయి. అయితే ట్రయల్ రన్ చేసేటప్పుడే ట్రాఫిక్ పెరిగింది. సాంకేతిక సమస్యలు తలెతిత్తే భూముల వివరాలు చూసుకునేందుకు అందరూ పోటీ పడుతున్నారని కేసీఆర్ సమర్థించుకున్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ధరణి పోర్టల్ వల్ల సమస్యలు మరింత పెరిగాయి. నిర్దిష్ట సమయంలో భూ సమస్యలు పరిష్కరించిన దరఖాస్తుల సంఖ్య 0.1 శాతం కూడా దాటదు. 18 లక్షల ఎకరాల పార్ట్-బీ భూముల సంగతి నేటికీ పెండింగులోనే ఉంది. అలాంటి ఫెయిల్యూర్ పోర్టల్ కు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఊరూరా పార్టీ, ప్రభుత్వం తరపున కార్యక్రమాలు నిర్వహించారు.

ధరణితో అనేక సమస్యలు..

ధరణిలో 1,45,58,000 ఎకరాల భూమి నమోదు చేశారు. అన్ని రకాల రికార్డులను క్లియర్ చేశామని ఆనాడు కేసీఆర్ ప్రకటించారు. అయితే సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేందుకు టీంలు రెడీగా ఉంటాయన్నారు. కానీ ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారో 35 మాడ్యూళ్లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా లక్షలాది మంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. అనుభవదారు కాలమ్ లో చేసిన మార్పులతో దశాబ్దాల క్రితమే దేశం విడిచి వెళ్లిన దొరలు, దేశ్ ముఖ్ లకు పట్టా పాసు పుస్తకాలు వచ్చాయి. దాని ద్వారా తిరిగి అమ్మకాలు సాగిస్తుంటే రికార్డుల్లో తమ పేర్లు లేవని దిక్కుతోచని పేద రైతుల సంఖ్య ఎక్కువే. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, అటవీ భూముల పేరుతో ఎన్నో ఎకరాలను ఆటోలాక్ చేసి, నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇప్పటికీ వేలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

భూభారతి అమలైతే..

ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి భూముల విలువ క్రమంగా పెరుగుతున్నది. అందుకే భూమి హక్కుల అంశం సెన్సిటివ్ గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామన్న భూ భారతిపై ఆశలు పెట్టుకున్నారు. ధరణి పోర్టల్ తప్పిదాలకు మరోసారి తావులేకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అమలు చేయడంతోపాటు మెరుగైన సేవలు అందించే క్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను నిర్వర్తించాలని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు. ధరణికి, భూ భారతికి మధ్య వ్యత్యాసం ఏమిటో రైతులు గుర్తించకపోతే ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ. అలాగే కొత్తదనాన్ని కూడా ఆవిష్కరణ నాటి నుంచే చూపించాలి. కాంగ్రెస్, రేవంత్ మార్క్ పాలనను భూ పరిపాలనలో ప్రదర్శించడం ద్వారానే లక్ష్యం నెరవేరుతుంది. సన్నబియ్యం పథకంతో మొదలైన పాటిజివిటీ భూ భారతితో పదింతలు చేసుకోవాల్సిన అవసరం రేవంత్ సర్కారుకు ఉన్నది. ఎన్ని గ్యారంటీలు అమలు చేసినా రూ.లక్షల కోట్ల విలువైన భూమి హక్కులకు భద్రత ఇస్తున్నామన్న భరోసాను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లభించే ప్రయోజనమే ఎక్కువ. అందుకే రైతుల మధ్యనే భూ భారతి చట్టాన్ని ఆవిష్కరించడం లాభదాయకమని పలువురు మేధావులు సూచిస్తున్నారు.

అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం

* జీపీవోల నియామకం పూర్తికాకముందే భూ భారతి చట్టం అమలు ఎలా చేస్తారు? నియామక ప్రక్రియక ఇంకా దరఖాస్తుల స్వీకరణ దశలోనే ఉన్నది.

* లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకపు ప్రక్రియ మొదలు కాలేదు. అలాంటప్పుడు సేల్ డీడ్ లో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే అంశాన్ని ఎలా అమలు చేస్తారు?

* ట్రిబ్యునల్స్ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టలేదు. జిల్లాకొకటా? ఉమ్మడి జిల్లా స్థాయిలోనే ఉంటుందా? లేదంటే అంతా సీసీఎల్ఏ పరిధిలోనే ఉంచుతారా?

* భూదార్ ప్రక్రియ మొదలు పెట్టడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. రికార్డుల ప్రక్షాళనతో తాత్కాలిక భూదార్ నంబర్ ఇవ్వడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది చేపట్టడం ద్వారా మరోదఫా రికార్డుల ప్రక్షాళన పూర్తి అవుతుంది. దాంతో ప్యూరిఫైడ్ ఆర్వోఆర్ తయారవుతుంది. అలాంటి అంశానికి ప్రాధాన్యత ఉంటుందా?

* ఇలా అనేక సందేహాలకు భూ భారతి అమల్లోకి రాకముందే నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.



Next Story

Most Viewed