- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత ఆచారాల్లోకి వెళ్లిపోతే రక్షణ ఉంటుందా?
కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న మాట వాస్తవమే. కానీ, పాశ్చాత్య ధోరణిలో పడి కొట్టుకుపోతున్న భారతీయులకు, మన సంప్రదాయాలు మరిచిన ఈతరం మనుషులకు మళ్లీ భారతీయతను గుర్తుచేస్తోంది. మన సంప్రదాయాల్లోని సైన్స్‌ను తట్టిలేపుతోంది. మనం పాటించిన ఆచార వ్యవహారాలను, మన జీవన విధానంలో అలవరుచుకున్న అలవాట్లను ప్రపంచానికి చాటి చెబుతోంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారమని గుర్తు చేస్తోంది. ఆ మడికట్టు విధానాలేంటని, శుచి, శుభ్రతలు ఎందుకని ఎగతాళి చేసినా ఎంతోమందితో ఈరోజు తు.చ తప్పకుండా వాటినే పాటించేలా చేస్తోంది. ఒక్కసారి ఈ రోజుల్లో నుంచి ఆ రోజుల్లోకి వెళ్లి వద్దామా!
కోడికూతతో పల్లె నిద్రలేచేది. పల్లె అంతా పేడనీళ్లతో చల్లిన అలుకుతో, పసుపు రాసిన గడపలతో పచ్చగా మెరిసేది. చుక్కల ముగ్గులతో ముంగిళ్లన్నీ అందంగా ముస్తాబయ్యేవి. తలుపులన్నీ మామిడి తోరణాలతో రారమ్మని ఆహ్వానించేవి. ఇంటింటా తులసి కోటలు దర్శనమిచ్చేవి. ఇల్లంతా సాంబ్రాణి సువాసనలు వెదజల్లేవి. తులసి చెట్టు ముందు వెలిగించే నేతిదీపాలు ఉభయ సంధ్యల్లో వెలుగులు పంచేవి. దేవుడి ముందు కర్పూర పరిమళాలు మరులు గొలిపేవి. ప్రతిఇంటి ముందు వేప, మామిడి చెట్లు గోడలా నిలబడితే, ఊరి చుట్టారా మేడి, మర్రి, రావి, చింతచెట్లు సరిహద్దుగా నిలిచేవి. పల్లెల్లోని ప్రజలంతా వేపపుల్లతో ముఖం కడుక్కునేవాళ్లు. కుంకుడుకాయలతో తలంటుకొని, పసుపు, నూనెలతో ఒల్లంతా మర్ధన చేసుకుని బావి నీళ్లతో స్నానం చేసేవాళ్లు. నడుముకు పంచె కట్టి, చెవి నిండుగా తలపాగా చుట్టేవాళ్లు. పల్లె పడుచులంతా కాళ్లకు పసుపు పారాణి రాసుకునేవాళ్లు. చేతులకు మైదాకు పెట్టుకునేవాళ్లు. పల్లెలు సహజంగా ఇలానే ఉండేవి. అక్కడి ప్రజల తీరు అలా ఉండేది.
చాదస్తమా? సైన్సా?
చెప్పాలంటే.. పల్లె జీవన విధానంలోనే సైన్స్ దాగి ఉంది. వాళ్లు పాటించే ప్రతి దాంట్లో ఓ పరమార్థం నిండి ఉండేది. అందుకే పల్లెజనం ఆరోగ్యంగా ఉండేవాళ్లు. వయసు మీద పడుతున్నా, వార్ధక్యం ఒంటిని చేరుతున్నా నిట్టనిలువుగా నిలబడేవాళ్లు. ఒంటరిగానే అన్ని పనులు చేసుకునేవాళ్లు. కళ్లద్దాలు లేకున్నా, మందుగోళీలు మింగకున్నా హాయిగా జీవించేవాళ్లు. వారు పాటించిన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లే వారిని ఆరోగ్యంగా ఉంచాయి. సూర్యుడు రాకముందే పల్లెజనం నిద్ర లేచేవాళ్లు. సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని, స్నానాదికాలు ముగించుకుని సూర్య నమస్కారం చేసేవాళ్లు. తద్వారా వారికి ఎండ తగిలేది. అందువల్ల వాళ్లకు ’’డి’’ విటమిన్ పుష్కలంగా లభించేది. ఎంతదూరమైన వాహనాల సాయం తీసుకోకుండా నడిచేవాళ్లు. ఆ కారణాల వల్లే వాళ్ల ఎముకలు దృఢంగా ఉండేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ తమ పనులు చేసుకుంటూనే, వ్యవసాయం కూడా చేసేవాళ్లు. అందువల్లే వారికి వ్యాయామశాలలు అవసరం రాలేదు. బ్రష్ చేయడానికి వేప పుల్లను ఉపయోగించేవాళ్లు. వేపలోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని క్రిములను నాశనం చేయడమే కాకుండా.. చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి. ఇక ఇళ్లన్నీ పేడ నీల్లు చల్లడం వల్ల … చుట్టుపక్కల ఉన్న క్రిమి కీటకాలు చచ్చిపోయేవి. ఆవుపేడలో పురుగులను, క్రిములను చంపేసే గుణాలున్నాయన్నది సైన్స్ పరంగా కూడా ప్రూవ్ అయ్యింది. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుమ్మాలకు ఉండే పసుపు, మామిడి తోరణాలు బయట నుంచి వచ్చే పురుగు పుట్రలను లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. సాంబ్రాణి పొగ దోమలను నివారిస్తుంది. తులసి చెట్టు, నెయ్యి దీపాలు కూడా ఆరోగ్యానికి చేసే మేలు అందరికీ తెలుసు. వేప, నీలగిరి ఆకులతో మరిగించిన నీళ్లతో స్నానం చేసేవాళ్లు. ఇలా చేయడం వల్ల.. వేప, నీలగిరి ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్లను సంహరించేవి. మహిళలు పెట్టుకునే మైదాకులో కూడా బ్యాక్టీరియాను చంపే గుణాలున్నాయి. మన పూర్వీకులు, పల్లె జనాలు పాటించే ఆచార, ఆహారపు అలవాట్లు వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వైరస్‌లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేవి.
అప్రాచ్యపు పనులు అడ్డుకునే అమ్మమ్మ, నాన్నమ్మలు
ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే.. వాకిట్లో చెప్పులు విడిచి కాళ్లు, చేతులు శుభ్రంగా కడిగి మరీ లోపలికి రావాలని ఎన్ని సార్లు చెప్పాలిరా అంటూ అరుగుపైన కూర్చున్న నాన్నమ్మ ప్రతి రోజూ అరుస్తూ ఉండేది కదా! స్నానం చేసిన తర్వాతే తినాలని ఎన్నిసార్లు మొట్టికాయ వేసి ఉంటుందో ఏమో. బయటంతా తిరిగి వచ్చిన తరువాత స్నానం చేసి , వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రమ్మని, ఉతకని బట్టలు కట్టుకోవద్దని కొన్ని వేలసార్లు హెచ్చరించి ఉంటుంది కదా.. ఆ పని చేసి, ఈ పని చేసి, ఆటలు ఆడుకొని, అక్కడ ముట్టి, ఇక్కడ ముట్టి వచ్చి.. చేతులు కడుక్కోకుండా తింటావా అంటూ చేతికర్రతో ఎంత చిలిపిగా కొట్టేదో! ఒకరు ఎంగిలి చేసింది తినకూడదని, తుమ్మో,దగ్గు వస్తుంటే.. నోటికి రుమాలు అడ్డుపెట్టుకోమని, తినేటప్పుడు తుమ్మితే నోట్లో నీళ్లు పోసుకుని పుకిలించి ఉమ్మి వేయమని గిల్లీ మరీ చెప్పేది. అన్ని రకాల కాయగూరలు తింటే ఒంటికి మంచిదని చాలా శ్రద్ధగా వినేలా చెప్పేది. కుక్కల్ని , పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకూడదని, వాటిని ముడితే సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కుంటేనే ఇంట్లోకి రానినిస్తానని ఎన్నిసార్లు గుమ్మానికి అడ్డుగా నిలుచున్నదో. ఇంట్లో ఇన్ని చేసి పెట్టినా, ఆ బయట అమ్మే చిరుతిళ్లు తింటావేంటిరా.. వాడు ఏం నూనె వాడాడో, అందులో ఏ పురుగులు పుట్రా పడ్డాయో అంటూ నానమ్మ గోల గోల చేయడం ఇంకా చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. నిన్న వండినవి తినకూడదని, వేడిగా ఉన్నప్పుడే తినాలని ఎంత చక్కగా చెప్పేదో. మడి కట్టుకొని వండాలని, తను వంట చేస్తుంటే ముట్టుకోవద్దని చురకలు అంటిస్తూ చెప్పేది. పిల్లల్ని నేరుగా ముద్దాడ వద్దని, పాత్రలు ఎండలో బోర్లా పెట్టాలని ఎంత మంచిగా సుద్దులు చెప్పేది. ఇవన్నీకూడా క్రిమి కీటకాలు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు వ్యాప్తి చెందకుండా చేసే పనులే. ఎవరైనా కనిపిస్తే చక్కగా నమస్కారం చేయాలని, పెద్ద వాళ్లైతే, కాళ్లు మొక్కి వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని ఒడిలో కూర్చోబెట్టుకుని మరీ చెప్పేది.
ఈతరం ఏం చేస్తోంది?
బయటకు వెళితే చెప్పులేసుకోవడం కామన్. కానీ, ఇప్పుడు.. వంటగదిలో, పడగ్గదిలో, హాలులో ఎక్కడ పడితే అక్కడ చెప్పలేసుకునే తిరిగేస్తున్నారు. చెప్పులేసుకుని అటు, ఇటు తిరగడం వల్ల.. మనకు తెలియకుండానే ఒకచోట ఉన్న క్రిములను .. మరో చోటుకు తీసుకు వెళ్తాం. అలా ఇల్లంతా కలియ తిరుగుతూ క్రిములను వ్యాప్తి చేస్తాం. ఇంట్లో ఫుడ్ ఉన్నా సరే.. బయట ఫుడ్ ఆర్డర్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇప్పడదో స్టేటస్ సింబల్‌గా చెప్పుకుంటున్నారు. దాని వల్ల కోరికోరి మరి రోగాలు తెచ్చుకుంటున్నాం. టైమ్ లేదని చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడ్డారు. వాటిని తరచూ తినడం వల్ల కూడా అనారోగ్యం తప్పదు. మహానగరాల్లో నిద్రించే వేళలు పూర్తిగా మారిపోయాయి. అర్ధరాత్రి దాటితే గానీ నిద్రపోని వారెంతో మంది. దాని వల్ల మెదడు చురుకుదనం దెబ్బతినడమే కాకుండా, మన జీవక్రియ దెబ్బతింటుంది. లేట్ గా నిద్రపోవడం వల్ల లేటుగా నిద్ర లేస్తారు. సూర్యరశ్మి శరీరానికి తాకదు. అందువల్ల శరీరానికి సరిపడా ’’డి‘‘ విటమిన్ అందదు. దాంతో ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. బోనస్ గా మరికొన్ని రోగాలు కూడా వస్తాయి. ఆఫీసు నుంచి రాగానే.. నేరుగా ఇంట్లోకి వెళ్లడం, హాల్లోనే చెప్పులు, షూ లు విడవడం, చేతులు కడుక్కోకుండానే స్పూన్ తో అన్నం తినడం చేస్తుంటారు చాలా మంది. మనం చేసే ఈ చిన్న పొరపాట్లే బ్యాక్టరీయాలను పెంచి పోషించేలా చేస్తాయి.
మనదైన ఇంటి వైద్యం
ఇప్పుడంతా అల్లోపతిని అనుసరిస్తున్నాం. కానీ, ఆ రోజుల్లో చెట్ల, ఆకుల రసాన్నే మెడిసిన్ లా ఉపయోగించడం పరిపాటి. జలుబు చేస్తే.. మిరియాల కషాయం లేదా శొంఠి కషాయం తాగించేవాళ్లు. లేదా పాలల్లో పసుపు కలిపి తాగమని చెప్పేవారు. దగ్గు వస్తే వాము తినాలని సూచించేవారు. తులసి, పుదీనా ఆకుల రసం తాగించేవాళ్లు. వెల్లుల్లి తినడం వల్ల దగ్గు తీవ్రత త్వరగా తగ్గుతుందనే చెప్పేవాళ్లు. జ్వరం వచ్చినప్పడు శక్తి కోసం రాగి జావ, జొన్న అంబలి, గంజి తాగేంచేవాళ్లు. బెల్లం నువ్వులు, పల్లిపట్టీలు, రాగి ముద్దలు వంటి బలవర్ధకమైన ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసేవాళ్లు. పసుపు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి పోషకాల దినుసులను వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించేవాళ్లు. ఉదయం ఎనిమిది గంటల లోపు అల్పహారమైనా, సాత్విక ఆహారమైన తీసుకోవాలని, సాయంత్రం ఏడు గంటల లోపు రాత్రి భోజనం చేయాలని సూచించేవాళ్లు.
కరోనా వచ్చి.. ఇలా మనందరినీ మళ్లీ ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లింది. మన ఆచార సంప్రదాయాలు, అలవాట్లు ఎంత గొప్పవో చెప్పకనే చెప్పింది.