భార్య వాళ్లతో మాట్లాడిందని.. నడిరోడ్డుపై నరకం చూపించిన భర్త

by Anukaran |   ( Updated:2021-08-19 05:37:26.0  )
భార్య వాళ్లతో మాట్లాడిందని.. నడిరోడ్డుపై నరకం చూపించిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన శత్రువు ఇంటివారితో మాట్లాడిందని భార్యను నడిరోడ్డు మీద, అందరు చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ భర్త. ఆ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దహెద్‌ జిల్లాకు చెందిన మకి మఖ్లా వాల్వాయ్‌ అనే మహిళ కుటుంబంతో కలిసి నివసిస్తోంది. కాగా, ఈ కుటుంబానికి వారి ఇంటి ఎదురుగా ఉంటున్న భదోర్‌ కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఆ ఆస్థి తగాదాల వలన ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం ఉంది. ఎన్నో ఏళ్లగా ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం మకి.. భదోర్‌ కుటుంబానికి చెందిన వారితో మాట్లాడింది. అంతే.. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.

నా శత్రువులతో మాట్లాడతావా..? అంటూ భార్యను విచక్షణా రహితంగా కొట్టడం మొదలు పెట్టాడు. మరో ముగ్గురు కుటుంబసభ్యులతో కలిసి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతేకాకుండా నడిరోడ్డుపై ఆమెను ఈడ్చుకొచ్చి దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతటి అరాచకం ఎక్కడైనా ఉందా..? భార్యను అంత దారుణంగా హింసిస్తారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed