రోడ్డుపై చొక్కా విప్పిన యువకుడు వృద్ధుడికి తొడిగి.. భోజనం పెట్టి..

by Mahesh |   ( Updated:2021-10-07 05:16:37.0  )
Ananthapuram
X

దిశ, ఏపీ బ్యూరో: మనం బతికితే చాలు ఇతరుల గురించి మనకెందుకు అనే రోజులువి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మనకెందుకులే అని చాలా మంది వెళ్లిపోతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అంతా మనవారే అనుకుని సమాజ సేవలో తరిస్తున్నారు. రోడ్డుపై వెళ్తుండగా ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధుడిని చూసి చలించిపోయాడు. వెంటనే బండి దిగి ఒంటిపై కనీసం చొక్కాలేని అతడికి తన షర్ట్ ఇచ్చి.. భోజనం తెప్పించి అతడి ఆకలి తీర్చాడు. ఈ మానవీయ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది.

తహసీల్దార్ కార్యాలయం దగ్గర మతిస్థిమితం లేకుండా ఆకలితో అలమటిస్తూ ఓ వృద్ధుడు తీవ్ర ఇబ్బందిపడుతున్నాడు. ఈ విషయాన్ని సేవాలాల్ సేవాసమితి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామావత్ చందు నాయక్ గమనించారు. ఆ వృద్ధుడిని పైకి లేపి ఓ చెట్టు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతడికి తాను వేసుకున్న చొక్కా తొడిగించి మానవత్వం చాటుకున్నాడు. అంతేకాదు.. తాను అక్కడే ఉండి మరొకరికి ఫోన్ చేసి భోజనం కూడా తెప్పించాడు. ఆ భోజనం వృద్ధుడికి ఇచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రమావత్ చందు నాయక్‌ను అభినందించారు.

Advertisement

Next Story