- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరిది ఒకేపార్టీ.. అయినా ఎడముఖం.. పెడముఖం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు.. మాజీ పార్లమెంట్ సభ్యుడు రాథోడ్ రమేష్.. తాజా మాజీ ఎంపీలిద్దరు ప్రస్తుతం ఒకే పార్టీ(బీజేపీ)లో ఉన్నారు. కానీ వారిద్దరు నిజంగా కలిసినట్టేనా.. అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఖానాపూర్ నియోజకవర్గంలో నిర్వహించే పలు కార్యక్రమాలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలకు తాజా ఎంపీ సోయం బాపురావు దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. రాథోడ్ చేరికను ముందు వ్యతిరేకించిన సోయం.. తర్వాత అనుకూలంగా మారారు. ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ, లంబాడాల వివాదం తీవ్ర స్థాయిలో ఉండగా.. వీరిద్దరు పూర్తి స్థాయిలో కలవకపోవటంలో ఇదే కారణమని తెలుస్తోంది..!
భారతీయ జనతా పార్టీలో రోజు రోజుకు విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొంతకాలంగా బీజేపీలోకి వలసలు పెరుగుతుండగా.. తాజా మాజీల మధ్య వివాదానికి తెరలేస్తోంది. కొత్త నాయకులు చేరుతుండటంతో.. పాత నాయకులు తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ, లంబాడా తెగల మధ్య రిజర్వేషన్ల పంచాయతీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే విభేదాలు, వివాదాలు తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న నాయకత్వం కూడా ఆదివాసీ, లంబాడా తెగల నుంచి ఉన్నవారే. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుగా ఉన్నాయి. ఈ నియోజక వర్గాల్లో ఎస్టీలే పోటీ చేయాల్సి ఉండగా.. వివిధ పార్టీల్లో ఆదివాసీ, లంబాడా నాయకులే బరిలో ఉంటున్నారు. తాజాగా బీజేపీలో ఇద్దరు కీలక నాయకుల మధ్య విచిత్రమైన పరిస్థితి నెలకొంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ రాథోడ్ రమేశ్ బీజేపీలో చేరారు. లంబాడా తెగకు చెందిన ఆయన చేరికను మొదట్లో ఆదివాసీ తెగకు చెందిన ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు వ్యతిరేకించారు. రాష్ట్ర నాయకత్వం మధ్యవర్తిత్వం, రాథోడ్ స్వయంగా సోయం బాపురావు ఇంటికి వెళ్లటంతో ఆయన చేరికకు లైన్ క్లియర్ అయింది. తాజాగా ఆయన పార్టీలో చేరాక.. విచిత్ర పరిస్థితి నెలకొంది. రాథోడ్ రమేశ్ ఉమ్మడి జిల్లాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆదివారం రోజున రాథోడ్ రమేశ్ ఉట్నూరులో ఉట్నూరు, ఇంద్రవెల్లి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జిల్లా ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్ హాజరు అయ్యారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా.. ఈ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పార్టీలో చేరికల కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు దూరంగా ఉన్నారు. అసలు సోయం బాపురావు, రాథోడ్ రమేశ్ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఒకే వేదికను పంచుకునే పరిస్థితి లేదనే చర్చ సాగుతోంది. ఆదివాసీ నాయకుడిగా ఉన్న సోయం, లంబాడా నాయకుడిగా ఉన్న రాథోడ్ ఒకే వేదికపై, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ఆదివాసీ, లంబాడా తెగల మధ్య క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేనందున.. ఇప్పటికిప్పుడు కలవటం సరికాదనే భావన ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నిజంగానే కలిసి పోయారా.. లేదా కలిసినట్టుగా ఉంటున్నారా.. అనే చర్చ సాగుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఖానాపూర్ సెగ్మెంట్ ఇంచార్జి సట్ల అశోక్, ఇటీవల బీజేపీలో చేరిన స్వతంత్ర జడ్పీటీసీ సభ్యురాలు భుక్యా జానుబాయి(పెంబి) కూడా రాథోడ్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.