మేయర్ ఎన్నిక మరో రోజుకు వాయిదా?

by Anukaran |
GHMC
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బల్దియా మేయర్ ఎన్నిక మరో రోజుకు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. హడావుడిగా ఎన్నికలు నిర్వహించి నెల రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త కార్పొరేటర్లకు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం మారనుంది. ఫిబ్రవరి 11న ప్రమాణం స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల అథారిటీ ప్రకటించింది. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి కార్పొరేటర్లు విముఖంగా ఉన్నారు. కారణం ఆరోజు అమావాస్య కావడమే. కొత్తగా ఎన్నికవనున్న మేయర్, డిప్యూటీ మేయర్‌లకు కూడా అమావాస్య అడ్డుగా నిలుస్తోంది. రాజకీయ పార్టీల హోరాహోరీ పోటీ మధ్య గెలిచిన కార్పొరేటర్లను కూడా అమావాస్య ఫీవర్ వెంటాడుతోంది.

సంప్రదాయం కాదు కదా?

అధికార పార్టీతోపాటు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేయడం లేదు. హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు కొత్త పనులు చేపట్టకూడదంటారని, తాము కూడా ఇందుకు మినహాయింపు కాదని ఓ బీజేపీ కార్పొరేటర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటే అమావాస్య రోజు చేస్తారా అని ప్రశ్నించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం కాకుండా మరో రోజు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్పొరేటర్ ఎన్నికలు డిసెంబర్ ఒకటిన జరపగా అదే నెల నాలుగున ఫలితాలు వెలువడ్డాయి. గెలిచినవారందరూ వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తామని ఆశించారు. ఎన్నికల కమిషన్ అధికారులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. రెండు నెలలు దాటిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరి 11న 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. అదే రోజు 12. 30కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని భావించారు. అదే రోజు ఈ కార్యక్రమం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు బల్దియాలో చర్చనీయాంశంగా మారింది.

అధికార పార్టీ ఆలోచన వేరేనా?

ముఖ్యంగా బీజేపీ కొర్పొరేటర్లు ఆ రోజు ప్రమాణస్వీకారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార పార్టీ ఆలోచిస్తోదని ఆరోపిస్తున్నారు. మూడు పార్టీలే కీలకంగా మారిన నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల ఓటింగ్ ప్రభావాన్ని చూపనుంది. ముందుగా అనుకున్న ప్రకారమే ఎన్నిక నిర్వహిస్తే బీజేపీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశాలు తక్కువ. అదే సమయంలో ఎంఐఎం, టీఆర్ఎస్ సభ్యులతో కోరం ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి మేయర్ ఎన్నిక తంతు నల్లేరు మీద నడకగా మారుతుందనే ఆశతో ఉందని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తమ పార్టీతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని, అవసరమయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని బీజేపీ కార్పొరేటర్లు చెబుతున్నారు.

Advertisement

Next Story