వంటచేసి వడ్డించినా.. ఇల్లాలికి ఎంగిలి మెతుకులేనా?

by Shyam |
వంటచేసి వడ్డించినా.. ఇల్లాలికి ఎంగిలి మెతుకులేనా?
X

దిశ, ఫీచర్స్: సొసైటీలో కుల మతాల పేరున.. ఆస్తి అంతస్తుల తారతమ్యాలతో.. రంగు రూపం విషయంలో కొనసాగే వివక్ష ఒకటైతే, అనాదిగా అనేక రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష మరొకటి. మహిళల వృత్తిపరమైన వివక్షను పక్కనబెడితే.. ఇంటి సభ్యుల నడుమ నిరాదరణకు గురవడమే కలవరపెట్టే అంశం. ప్రధానంగా పౌష్టికాహారానికి సంబంధించి బాలికల నుంచి మహిళల వరకు తమ సొంత ఇంట్లోనే ప్రాధాన్యత దక్కడం లేదు. మగపిల్లలను గారాబం చేస్తూ బలవర్ధక ఆహారాన్ని అందించే తల్లిదండ్రులు, అమ్మాయిల విషయంలో ఆ చొరవను కనబరచకపోగా, కొన్ని పదార్థాలు తినకూడదంటూ ఆంక్షలు విధించడం శోచనీయం. మహిళలు సైతం న్యూట్రిషన్ ఫుడ్‌ను కుటుంబ సభ్యులకు పెట్టేందుకు ప్రాధాన్యతిస్తారు తప్ప, తమ గురించి ఆలోచించరు. ఇప్పటికీ అనేక కుటుంబాల్లో భర్త, కుటుంబ సభ్యుల తర్వాతే ఆఖరున ఇల్లాలు భోజనం చేసే సంప్రదాయం కొనసాగుతోంది. ముఖ్యంగా పేదలు, అట్టడుగు సామాజిక వర్గాల్లో ఈ ఆచారం వేళ్లూనుకుపోయింది. కాగా ఇలాంటి పద్ధతులకు మద్దతిస్తున్న నిబంధనలపై దృష్టి సారించిన యూపీలోని ఎన్జీవో.. లోతైన విశ్లేషణ ద్వారా సవాళ్లను అధిగమించేందుకు పలు సిఫార్సులు చేసింది.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాష్ట్రస్థాయి ఎన్జీవో సమర్థ్… రెండు జిల్లాలపై దృష్టిసారించింది. ఇంట్లో ఆహార పంపిణీ, వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు, పద్ధతులను అర్థం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, బాలికల్లో ఆహార వినియోగం తమను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో అంచనా వేసే ప్రయత్నం చేసింది. ‘ఎవరు ఎప్పుడు ఎంత తింటారు, ఏం తింటారు?’ అనే విషయంపై చేపట్టిన అధ్యయనం లోతైన, వేళ్లూనుకున్న సవాళ్లను పరిష్కరించేందుకు సూచనలు చేసింది.

లింగ ఆధారిత ఆహార నిషేధాలు, పరిమితులు
మహిళలు రుతుస్రావం, గర్భధారణ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తినకూడదనే ఆంక్షలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో చాలావరకు మహిళలకు హానికరం. ‘ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్, కొన్ని మహిళా సంఘాలతో లోతైన ఇంటర్వ్యూలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌తో ముఖాముఖి చర్చలతో పాటు 400 కుటుంబాలపై చేసిన సర్వే ద్వారా ఇతర ఆహార నిషేధాలు, ఆంక్షలు.. మహిళలు, పిల్లలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కౌమారదశలో ఉన్న బాలికలు, చిన్న పిల్లలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయని చూపించాయి’ అని ఇండియాలో డబ్ల్యూఎఫ్‌పీలో జెండర్ ఆఫీసర్, అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఆరాధన శ్రీవాస్తవ తెలిపారు. కొన్ని ఆహార పదార్థాలపై సామాజిక నిబంధలు తీవ్ర ప్రభావం చూపుతాయనే విషయం ఈ పరిశోధనల్లో వెల్లడైంది.

కుటుంబం కోసం ఆహారాన్ని త్యాగం చేస్తున్న మహిళలు..
సాధారణంగా మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చే బాధ్యతను పురుషులు తీసుకుంటే.. ఆహారాన్ని వండి వడ్డించే బాధ్యతను మహిళలు నిర్వర్తిస్తారు. కానీ, మూడింట రెండొంతుల గృహాల్లో ముందుగా భర్త, పిల్లలు లేదా వృద్ధులు(ముఖ్యంగా పురుషులు) తినేస్తారు. మిఠాయిలు, స్వీట్లు వంటి ‘ప్రత్యేక ఆహార వస్తువు’ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. లక్నో, ఫతేపూర్‌లోని 85% కుటుంబాలు ఇదే విషయాన్ని నివేదించాయి. కాగా, సాంప్రదాయాలు ఎక్కువగా పాటించే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ ప్రభావం ఎక్కువని పరిశోధనలో తేలింది. అధిక శాతం కుటుంబం కోసం శ్రమించేది పురుషులేనని మహిళలు విశ్వసించడమే అందుకు కారణం. అయితే గర్భిణులు, బాలింతలు కూడా ‘చివరిగా తినడం’ వల్ల వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనను వ్యక్తం చేసింది అధ్యయనం. కానీ.. పురుషులు, మహిళలు ఎవరు కూడా దీన్ని వివక్షగా పరిగణించకుండా, సాధారణంగా అంగీకరించడం గమనార్హం. పైగా కుటుంబసభ్యుల కంటే ముందుగా తినడాన్ని అగౌరవంగా భావించే ఫ్యామిలీస్ ఉన్నాయి. సంవత్సరాలుగా పరిస్థితి మెరుగుపడుతున్నా.. ఈక్విటీ సాధించడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.

మార్పు కనిపిస్తున్నా..
మహిళలు ఎక్కువగా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఏదేమైనా, మహిళలు ఇతర కుటుంబ సభ్యుల కోసం ఆహారాన్ని త్యాగం చేయాలి అనే మనస్తత్వం అనేక కుటుంబాలలో కనిపిస్తూనే ఉంది. పెరుగుతున్న విద్య, పట్టణీకరణ, ఆదాయాలను మెరుగుపరచడంతో సాంప్రదాయ నిబంధనలు క్రమంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ పేదల్లో మహిళల పని భాగస్వామ్యంలో పెరుగుదల కూడా ఒక ముఖ్య అంశం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (AWW, ASHA, ANM) గృహాల్లో ఆహార పంపిణీ సాంప్రదాయ వ్యవస్థలో కావాల్సిన ప్రవర్తనా మార్పులను తీసుకురావడంలో మార్పు ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించారు.

పురోగతి కోసం కీలక సిఫార్సులు..
కుటుంబాల్లో ఈ తరహా ప్రవర్తనలో మార్పు అవసరం కానీ, అనుకున్నంత సులభం కాదు. స్త్రీ, పురుషలకు ఆహార పదార్థాల్లో తేడాల వల్ల అది మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఏవిధమైన ప్రతికూల ప్రభావం చూపుతుందో అవగాహన కల్పించాలన్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రసవ సంవత్సరాల్లో మహిళల పోషణకు సమాన ప్రాధాన్యతనివ్వడానికి కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను అధ్యయన ఫలితాలు నొక్కిచెప్పాయి. అన్ని కమ్యూనిటీ సభ్యులలో, ముఖ్యంగా చిన్న పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణీ, పాలిచ్చే మహిళల పోషణపై పోషకాహార విద్య మరియు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. పేద కుటుంబాలలో మహిళల పోషకాహారలోపం ఎక్కువగా ఉండే ప్రమాదం అధిక పేదరికం ఉన్న మహిళలకు ప్రత్యేక పోషకాహార కార్యక్రమాల అవసరాన్ని సూచిస్తుంది.

అవగాహన కల్పించాలి..
స్థిరమైన సామాజిక మార్పు కోసం పురుషులు కూడా పాలుపంచుకోవాలి. మహిళలు తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసే స్వేచ్ఛను కల్పించడం, కుటుంబంతో కలిసి తినడానికి ప్రోత్సహించడం, కుటుంబ సభ్యుల మధ్య ఆహారాన్ని సమానంగా పంచుకోవడం, గర్భధారణ & చనుబాలివ్వడం సమయంలో మహిళల పోషకాహార అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడంపై వారికి అవగాహన కల్పించాలి.

అపోహలు..
గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సర్వేలో అనేక అపోహలు బహిర్గతమయ్యాయి. చాలా మంది మహిళలు.. గర్భిణి స్త్రీలు డ్రై ఫ్రూట్స్ తినడం మానుకోవాలని, కొబ్బరి తింటే పుట్టబోయే బిడ్డ అందంగా ఉంటాడనే విశ్వాసాలను వెలిబుచ్చారు. గర్భధారణ సమయంలో పండ్లు (అరటి, బొప్పాయి, జాక్ ఫ్రూట్, కొబ్బరి), కూరగాయలు (వంకాయ, ఆకు కూరలు), మాంసం, చేపలు, గుడ్ల వినియోగంపై పరిమితులు విధించడం వల్ల గర్భస్రావం జరగదని, డెలివరీ సులభంగా అవడంతో పాటు పిండ వైకల్యాలను నివారించవచ్చని ఫతేపూర్‌కు చెందిన ఒక ఫ్రంట్‌లైన్ కార్మికురాలు అభిప్రాయపడింది.

దీర్ఘకాళిక ప్రణాళిక అవసరం..
అన్ని కమ్యూనిటీ సభ్యుల్లో.. ముఖ్యంగా చిన్నపిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింత మహిళల పోషణపై పోషకాహార విద్య, అవగాహన పెంచడంపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలనే విషయాన్ని ఈ పరిశోధన హైలైట్ చేస్తోంది. ఈ నిబంధనలు, నిషేధాలు బాలికలు, మహిళలను విపరీతమైన ప్రతికూలతలో ఉంచుతాయి. వారి ఆహార వైవిధ్యాన్ని తగ్గిస్తాయి.
– డాక్టర్ శ్రీవాస్తవ

Advertisement

Next Story

Most Viewed