- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనాథాశ్రమాల్లో పస్తులు.. కడుపు నింపేది ఎవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్ ఇప్పటికే అన్ని వ్యవస్థలను కుదిపేసింది. లాక్ డౌన్ ఆర్థిక కష్టాలను తీసుకొచ్చింది. దీంతో అందరూ ఖర్చులు తగ్గించి, పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. ఈ కారణాల వల్ల అనాథాశ్రమాల స్థితిగతులు చాలా దారుణంగా మారాయి. కేవలం దాతల సహాయంతో నడిచే అనాథాశ్రమాల విరాళాలు తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణ సమయాల్లోనే ఆశ్రమాలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ.. కావు. అలాంటిది కరోనా టైంలో దాతలు ముందుకురాక, ప్రభుత్వాలు పట్టించుకోక నానా అవస్థలు పడుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు. డొనేషన్స్ రాక విద్యార్థుల కష్టాలను తీర్చలేక నిర్వాహకులు తల్లడిల్లుతున్నారు. తినేందుకు కూడా పలు ఆశ్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మరికొన్ని చోట్ల అద్దె చెల్లించేందుకూ డబ్బులు లేక సతమతమవుతున్నారు. దీంతో వారిని ఖాళీ చేయాల్సిందిగా యజమానులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆశ్రమాల నిర్వహణ కష్టమై పలుచోట్ల ఆశ్రమాలు మూతపడిన సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అనాథలను పోషించలేక చేయూతనందించాలంటూ నిర్వాహకులు.. దాతలను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
భారీగా తగ్గిన విరాళాలు
కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధింపుతో అందరికీ ఆదాయం తగ్గిపోయింది. ఈ ఎఫెక్ట్ దానాలు, విరాళాలపై గట్టిగా పడింది. చాలామంది ఆదాయం లేక విరాళాల విషయంలో కోతలు విధించుకున్నారు. కొవిడ్ రాక ముందు అనేకమంది అనాథాశ్రమాలకు విరాళాలు భారీగా ఇచ్చేవారు. దాతలు ముందుకు వచ్చి, వాళ్ల స్పెషల్ డేస్ ను పుట్టిన రోజును, పెళ్లి రోజులను జరుపుకునే వారు. కానీ ఈ మహమ్మారి కారణంగా ఎవరూ బయటికి రావడంలేదు. దీంతో ఆశ్రమాలకు వేడుకలు నిర్వహించుకొని విరాళాలు అందించేవారు చాలా వరకు తగ్గుముఖం పట్టారు. దీనికి తోడు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలామంది వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి పలు సంస్థలు. వాటితో కుటుంబాలను నెట్టుకురావడమే గగనంగా మారడంతో అనాథాశ్రమాలకు విరాళాలు చేసేవారు కరువయ్యారు.
అన్ని ఆశ్రమాల్లోనూ ఇదే పరిస్థితి
లాక్ డౌన్ కు ముందు ఆశ్రమాల్లో పిల్లల చదువును భరించేందుకు ప్రైవేట్ పాఠశాలలు, దాతలు ముందుకొచ్చేవారు. ఇప్పుడు పాఠశాలలకు సైతం నిర్వహణ ఖర్చులు భరించలేక అనాథపిల్లలకు ఆన్ లైన్ లో చదువులు అందించేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనాథ విద్యార్థి గృహం, వాత్సల్యం, స్ఫూర్తి, ఆరాధన వంటి రిజిస్టర్ అయిన అనాథాశ్రమాలు 700కు పైగా ఉన్నాయి. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఇవన్నీ కేవలం దాతల విరాళాల మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. అనాథల సంఖ్యను బట్టి సుమారు వంద మంది ఉన్న ఆశ్రమాల్లో నెలకు రెండున్నర లక్షల నుంచి మొదలు రూ.5 లక్షల వరకు నిర్వహణ ఖర్చు అవుతోంది. అలాంటిది ప్రస్తుతం రూ. 1 లక్ష రావడం కూడా కరువైంది. దీంతో అనాథల భోజనం, చదువు వంటి అంశాలపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. విరాళాలు తగ్గిపోవడం, దాతలు ముందుకు రాకపోవడం వల్ల ఆశ్రమ నిర్వహణ భారాలు మోయలేక నిర్వాహకులు ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.
పలువురికి కొవిడ్ పాజిటివ్
పలు ఆశ్రమాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కొందరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సహాయం అందక వారి వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. క్వారంటైన్ జాగ్రత్తలు పాటించేందుకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్య ఖర్చులు కూడా మరింత భారంగా మారాయి. పౌష్టికాహారం అందించాలంటే విరాళాలు తక్కువగా అందుతుండటంతో దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు ఉన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కొవిడ్ విపత్కర పరిస్థితులతో సహాయం చేసేందుకు దాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. రెగ్యులర్ గా ఇచ్చేవారు కూడా చాలా తక్కువ మొత్తంలో ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్వహణ ఖర్చు ఎక్కవైపోయింది. భవన యజమానులు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలి. పిల్లల ఇబ్బందులు చూసైనా కనికరించాలి.
– రాఘవేంద్ర, చిల్డ్రన్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
సాయం చేయండి
కరోనాకు ముందు చాలా బాగుండేది. కొవిడ్ కారణంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. దాతలుంటే ముందుకు వచ్చి సాయం చేయండి. ఎందరో అనాథలకు చేయూతనిచ్చినట్లు అవుతుంది. గతంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి విరాళాలు అందించేవారు. కరోనా కారణంగా వేడుకలు జరగకపోవడంతో ఎవరూ ఆశ్రమాలకు రావడంలేదు. విరాళాలు కూడా అందడం లేదు. దాతలు సాయం అందించండి.
-అశ్విని, పదో తరగతి, వాత్సల్యం అనాథాశ్రమం