మరోసారి చైనాను సమర్థించిన డబ్ల్యూహెచ్‌ఓ

by vinod kumar |
మరోసారి చైనాను సమర్థించిన డబ్ల్యూహెచ్‌ఓ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ పుట్టుక గురించి ఎన్నో థియరీలు, అధ్యయనాలు బయటకు వస్తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇప్పటికీ చైనా చెప్పిన కారణమే సహేతుకంగా ఉందని చెబుతున్నది. వైరస్ పుట్టుకపై మరోసారి డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టతనిచ్చింది. చైనాలోని ల్యాబ్‌లో కరోనాను పుట్టించారని అమెరికా వాదిస్తుండగా.. రష్యా కూడా అదేరకమైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నది. అయితే.. ఆ రెండు దేశాల వాదనల్లో పస లేదని.. అసలు ల్యాబ్ లో పుట్టిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేస్తోన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలన్నింటినీ పరిశీలిస్తే కరోనా వైరస్ చైనాలోని కొన్ని రకాల జంతువుల నుంచి మానవులకు సోకినట్లుగా స్పష్టమవుతోన్నదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోన్నది.

ఇంతవరకూ గుర్తించలేదు…

కరోనా వైరస్ ల్యాబ్‌లో గానీ, మరో చోటులో గానీ ఉత్పత్తి చేయబడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా ఖచ్చితంగా జంతువుల నుంచి మనుషులకు పాకిందని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి ఫదేలా చైబ్ అంటున్నారు. అయితే జంతువుల నుంచి మనుషులకు ఎలా పాకిందనే దానిపై మాత్రం స్పష్టత ఇంకా రాలేదని చెప్పారు. జంతువులకు, మనుషులకు మధ్య బలమైన వాహకంగా పని చేసిందేమిటో ఇంతవరకూ గుర్తించలేదని ఆయన చెప్పారు.

అలాంటి ఆధారాలు లేకుండా..

గబ్బిలాలే ఈ వైరస్‌కు పుట్టుక అని తెలుస్తున్నా.. అసలు వాటి నుంచి మనుషులకు ఎలా వ్యాపించిందనే విషయంపై ప్రస్తుతం పరిశోధన జరుగుతోందన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లు ల్యాబ్స్‌ నుంచి లీకై బయటకు వచ్చే అవకాశమే లేదని ఆయన చెప్పారు. కాగా, కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంపై ఫదేలా చైబ్‌ను ప్రశ్నించగా.. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఏర్పడిన అపోహలను తాము తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కరోనా పుట్టుక గురించి మీడియాలో ప్రచారం చేయవద్దని.. దీని వల్ల దేశాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు.

Tags: China, America, Coronavirus, Wuhan Lab, Research and Bats

Advertisement

Next Story

Most Viewed