ఇంతకూ కాంగ్రెస్‌లో ఇంటి దొంగలెవరు..?

by Anukaran |   ( Updated:2021-07-13 21:53:43.0  )
GandhiBhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీలో మళ్లీ కోవర్టు కథ తెరకెక్కింది. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ముందుగా కోవర్టులపైనే గురి పెట్టినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్​ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టులున్నారని, గాంధీభవన్‌లో మాట్లాడే ప్రతి అంశం ముందుగానే ప్రగతి భవన్‌కు చేరుతుందని ఏడేండ్ల నుంచి వినిపిస్తున్న మాటే. అయితే ఇటీవల కొన్ని పరిణామాలతో కోవర్టుల వ్యవహారం పార్టీ పెద్దలకు కూడా రూఢీ అయింది. దీంతో ముందుగానే కోవర్టులను ఏరివేసే దానిపైనే కన్నేసినట్లు తెలుస్తోంది.

ఈ నెల 7న టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రోజుల పాటు జరిగిన వరుస సమావేశాల్లో దీనిపైనే చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కోవర్టులను బయటకు తీసుకురావడం ఎలా అనే దానిపై సీరియస్ వర్క్ నడుస్తుందంటున్నారు. మరోవైపు ఇన్నేండ్లు చేతికి నష్టం చేసి గులాబీ గూటికి సమాచారం ఇచ్చిన వారిలో కూడా గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. కోవర్టు ముద్రను చెరిపేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్.

కోవర్టులతోనే కకావికలం

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కోవర్టుల భయం ముందు నుంచీ వెంటాడుతోంది. ఒక దశలో టీపీసీసీ చీఫ్ ​ఉత్తమ్​ పైనే మాజీ ఎంపీ వీహెచ్ ​ఆరోపణలు చేశారు. ఉత్తమ్​ పెద్ద కోవర్టు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆ తర్వాత చాలా మంది నేతలపై ఈ ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పార్టీలో కొందరు కోవర్టులుగా వ్యహరిస్తున్నారని పార్టీ అధిష్టానం కూడా భావించింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ కాంగ్రెస్ నేతల మాటలు పలుమార్లు స్పష్టం చేశాయి. బహిరంగంగా అధికార పార్టీని విమర్శిస్తూ మరో దారిలో వారివారి సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు.

అంతేకాకుండా అధికార పార్టీతో గొడవలు లేకుండా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నామంటూ కాంగ్రెస్​కు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ అంటేనే అగ్గిమీద గుగ్గిలంగా వ్యవహరిస్తూ విరుచుకుపడినట్లు నటిస్తున్న కొంతమంది.. గులాబీ బాస్ ​ఎదుట మోకరిల్లినట్లు అంచనా. ఇలాంటి అంశాలపై పార్టీలోనే చాలాసార్లు విభేదాలు సృష్టించాయి. పార్టీ కోసం కార్యకర్తల కోసం అధికార పార్టీతో కయ్యానికి కాలు దువ్వితే కాంగ్రెస్ ముఖ్యనేతలు లాలూచి పడి టీఆర్ఎస్‌తో కోవర్టు రాజకీయాలు నడుపుతున్నప్పుడు తాము ఎందుకు కయ్యానికి పోవాలంటూ హస్తం పెద్దల ముందే గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇంటి దొంగలపైనే ఫోకస్​

తాజాగా కౌశిక్​రెడ్డి అంశంపై రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హస్తం పార్టీలో ఇంటి దొంగలను వదిలిపెట్టమంటూ ప్రకటించారు. కౌశిక్​రెడ్డిని కోవర్టుగానే చూపించారు. అయితే ఇదే తరహాలో చాలా మంది నేతలు ఇంకా అధికార పార్టీకి పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరందరిపై రేవంత్​రెడ్డి ఫోకస్ ​పెట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు ఏఐసీసీ నుంచి కూడా ఈ అంశంలో రేవంత్​కు ఫుల్ ​సపోర్ట్​ కూడా ఉందని స్పష్టమవుతూనే ఉంది.

టీపీసీసీ చీఫ్​ నియామకం తర్వాత పార్టీలో కొంత జోష్​ పెరిగింది. దీంతో ఇప్పటి వరకు పార్టీని వదిలి వెళ్దామనే ఆలోచనతో ఉన్న వారంతా మొత్తానికి సైలెంట్ ​అయ్యారు. కానీ ఎవరిపై కోవర్టు ముద్ర పడుతుందో, ఎవరు అడ్డంగా దొరికిపోతారనే భయం మాత్రం నేతల్లో ఉంది. ఇంటి దొంగలను బయటకు పంపించేందుకు రేవంత్​రెడ్డి కూడా ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తిగానే మారింది.

ఇక గతంలో లేని విధంగా కౌశిక్​రెడ్డి వ్యవహారంలో పార్టీ నేతలు దూకుడుగా వ్యవహరించారు. జిల్లా స్థాయి నేతల నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా కౌశిక్​రెడ్డి వైఖరిని ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉంటే టీపీసీసీ చీఫ్ ​దృష్టిలో కొంత మంచి పేరు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

Advertisement

Next Story