Taliban in Afghanistan : క్షణక్షణం ఉత్కంఠ.. ఆఫ్ఘనిస్థాన్‌లో అసలేం జరిగింది? రీడ్ ది స్టోరీ!!

by Anukaran |   ( Updated:2023-03-30 16:45:58.0  )
Afghanistan
X

దిశ, పబ్లిక్ పల్స్: శాంతియుతంగా అధికారాన్ని కైవసం చేసుకున్నామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ, ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తు మీద మాత్రం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్‌కు రాకముందు తాలిబన్ల పాలనను రుచి చూసిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులు భవిష్యత్తును తలుచుకొని కలవరపడుతున్నారు. దేశ ప్రజలందరికీ తాము క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ, అక్కడ మహిళలు, పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా భద్రతాదళాలు ఆస్ఘాన్ నుంచి వైదొలుగుతున్న క్రమంలో, కేవలం రెండు, మూడు వారాల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకోవడం, మిలిటరీ ఏమాత్రం ప్రతిఘటించకుండానే వాళ్లకు సరెండర్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ సైనిక దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా గత రెండు దశాబ్దాలలో చాలా కృషి చేసింది. అవి సత్ఫలితాలు ఇవ్వలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్లడం మొదలైన వెంటనే ఆఫ్ఘన్ సైన్యం తమ మనోధైర్యాన్ని కోల్పోయిందని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తాము శాంతియుతంగానే ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబన్ల సెకండ్ చీఫ్ బరాదర్ ఘనీ అని హామీ ఇస్తున్నారు. గతంలో వారి పరిపాలన తీరు తెలిసిన స్థానికులు మాత్రం దీనిని విశ్వసించడం లేదు.

బిగ్ బ్రేకింగ్ : తాలిబన్లపై ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం

(తాలిబన్ల వింత చేష్టల వీడియో కోసం క్లిక్ చేయండి)

ఇప్పటికే వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు తరలిపోయారు. తరలిపోతున్నారు కూడా. తాలిబన్ల పాలనలో ముఖ్యంగా ఇబ్బంది పడేది మహిళలు మాత్రమే. గతంలో వీరి హయాంలో మహిళలకు స్వేచ్ఛ దొరకలేదు. ఇప్పుడు దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. మహిళలు కారణం లేకుండా బయటకు రాకూడదు. ఒకవేళ అత్యవసరంగా బయటకు వస్తే తమ వెంట భర్తను గానీ, తండ్రిని గానీ, సోదరుడినిగానీ తీసుకొని రావాలని హుకూం జారీ చేశారు. ఒంటరిగాగానీ, ఇతర పురుషులతోగానీ బయట కనిపించినా, మోకాళ్లు కనిపించేలా దుస్తులు ధరించినా రాళ్లతో కొట్టి చంపుతామని స్పష్టం చేశారు. భర్త చనిపోయిన మహిళలు, యువతులు తమ ఫైటర్లను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో అక్కడ మహిళలకు ఏమాత్రం భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆఫ్ఘనిస్థాన్‌లో వసతులను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం అక్కడ వేల కోట్ల రూపాయలను పెట్టి తాగు, సాగునీటి కొరత తీర్చడానికి ఒక డ్యామ్‌ను, పార్లమెంట్ భవనాన్ని, అధ్యక్ష భవనాన్ని కూడా కట్టించి ఇచ్చింది. వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం భారత్‌కు అవసరం కాబట్టి భారత్ ఆ పని చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు భారత్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి. తాలిబన్ల అధికార ప్రతినిధి మాట్లాడుతూ తమ దేశ అభివృద్ధికి భారత్ నిధులు కేటాయించడం అభినందనీయం అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ దేశం నుంచి వేరే దేశం మీద సైనిక చర్యలకుగానీ, దాడులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాలిబన్లు భారత్‌కు ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానమే.

మరోవైపు పాకిస్తాన్ తనకు తాలిబన్లతో నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తాజా పరిణామాల మీద కిక్కురుమనడం లేదు. బలూచిస్తాన్, సింధ్ ఫస్తూన్ ఖ్వా రాష్ట్రాల పరిస్థితి కూడా అయోమయంగా మారింది. అవన్నీ కూడా స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించడానికి పావులు కదుపుతున్నాయి. ఇటు రష్యా కూడా తాలబన్లకు సహకారం అందిస్తున్నది. ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి తమ రాయబార సిబ్బందిని ఉపసంహరించుకోవడానికి కానీ, సిబ్బందిని తిరిగి రప్పించుకోవడానికికానీ రష్యా ప్రయత్నం చేయలేదు. తమకు ఎలాంటి హానీ జరగదనే నమ్మకం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంగానే చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ బలగాలను ఆప్ఘాన్ నుంచి సెప్టెంబర్ లోగా పూర్తిగా ఉపసంహరించుకుంటామని చెబుతున్నారే తప్ప, ఆఫ్ఘనిస్తాన్ రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అక్కడ అరాచకాలను, హింసను ఎలా నియంత్రిస్తారో మాత్రం చెప్పడం లేదు.

ఇతర దేశాలలో తమ సైనిక శక్తిని వినియోగించటం ద్వారా తమ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందని అమెరికా భావిస్తోంది. ఈ కారణంతోనే ఆప్ఘన్ నుంచి భద్రతా దళాలను ఉపసంహరించుకుంటామని గతంలో డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, విదేశీయులకుగానీ, స్థానికులకుగానీ, ఇతరులకుగానీ ఎలాంటి ఆపద తలపెట్టబోమని, శాంతియుతంగా పరిపాలన కొనసాగిస్తామని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటామని తాలిబన్లు హామీ ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత అమెరికాలో అధికార మార్పిడి జరగడం, కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కూడా తమ సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతుందని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను ఇస్లామిక్ దేశంగా పేరు మారుస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. షరియా చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

(ఎవరీ తాలిబన్లు..? ఆఫ్ఘాన్ పై ఎలా విరుచుకుపడ్డారు? వీడియో కోసం క్లిక్ చేయండి)

ఈ పరిణామ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. ఆయన తజకిస్తాన్‌లో తలదాచుకున్నారు. సోమవారం తాలిబన్లు ఒక ప్రకటన చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధం ముగిసిందని, అధికారాన్ని తాము కైవసం చేసుకున్నామని, ఈ దేశం ఇక తమ రక్షణలోనే ఉంటుందని విస్పష్టమైన ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద పై తీవ్ర విమర్శలు చేశారు. దళాల ఉపసంహరణపై కొనసాగింపును ఆలస్యం చేయడమే కాకుండా, తాలిబన్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి అధ్యక్షుడు అవకాశం కల్పించారని మండిపడ్డారు. ఇది అమెరికాకు సిగ్గుచేటైన విషయమని, ఇంతకంటే ఘోర పరాభవం ఏమీ ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో తమలాగా ఎలాంటి ఒప్పందం చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు రెచ్చిసోతున్నారని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బైడెన్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా బలగాలే ఈ కాల్పులకు కారణం. ఆప్ఘన్ పౌరులు విదేశాలకు తరలిపోవడానికి వచ్చి ఆర్మీ విమానాలు ఎక్కినప్పుడు కాల్పులు జరిగాయని చెబుతున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ పౌరులను తమ విమానాలలో ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా అమెరికా అంగీకరించడం లేదా? ఇటు చాలా విచిత్రంగా అమెరికా రాయబారి తమ దేశం జెండాను తన సంకలో పెట్టుకొని విమానాశ్రయానికి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆప్ఘాన్‌తో పూర్తి సంబంధాలు తెంచుకోవాలని భావిస్తే ఆ విషయాన్ని అమెరికా విస్పష్టంగా ప్రకటించి ఉండాల్సిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. చివరకు మంగళవారం 640 మందిని అమెరికా విమానంలో తీసెకెళ్లి ఖతార్ లో వదిలిపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘన్ ప్రముఖ క్రికెటర్ రషీద్ ఖాన్ ఒక ప్రకటన చేశారు తమ దేశాన్ని అరాచకంలో వదిలివేయవద్దని, రాజకీయ సుస్థిరత, శాంతిభద్రతలు నెలకొనేలా చూడాలని ప్రపంచదేశాల నేతలకు విన్నవించారు. ఈ ట్వీట్‌కు భారీ స్పందన వచ్చిందిగానీ, ప్రపంచ నేతలు ఎవరూ స్పందించలేదు. పాకిస్తాన్ తేలుకుట్టిన దొంగలా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

-ఫజుల్‌రహమాన్,
9010223917

తాలిబన్ల తల తిక్క వేషాలు..!

Advertisement

Next Story

Most Viewed