హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ కీలక నేతకు ఆ రెండు పార్టీలు గాలం?

by Anukaran |
Jinnareddy Srinivas Reddy
X

దిశ, నేరేడుచర్ల : హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయనో కీలక నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ముఖ్య అనుచరుడిగా పేరొందిన నాయకుడు. తన అనుచర, అభిమానులతో గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలిగిన సమర్థవంతమైన లీడర్. నాటి రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి షర్మిల వరకు సుపరిచితుడే. కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూర్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. నేడు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడం.. షర్మిల పార్టీ స్థాపిస్తుండడంతో ప్రస్తుతం ఆయన చూపు ఆ రెండు పార్టీలపై పడి.. పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇంతకు ఎవరా కీలక నేత.. ఏ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఆయన సన్నిహితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

వైఎస్ విధేయుడిగా ముద్ర

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డారు జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 2008 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సీటు ఆశించి భంగపడ్డారు. అప్పటికే ఆ సీటుపై కన్నేసిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. అయినా వైఎస్ ఉన్నన్ని రోజులు ఆయన వెంటే విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు.

వైఎస్ మరణం తర్వాత వైసీపీలోకి…

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరవాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. అలాగే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా పని చేశారు. ఈస్ట్, వెస్ట్ గోదావరి, విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాలకు పార్టీ సమన్వయకర్తగా సేవలందించారు. నాడు షర్మిల తలపెట్టిన పాదయాత్రలో మహబూబ్‌నగర్ ఇంఛార్జ్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం తెలుగు రాష్ర్టాల్లో రెండుగా చీలిపోవడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.

సైదిరెడ్డి విజయంలో కీలక భూమిక

2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వెంటే ఉంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం తారుమారైంది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. హుజూర్ నగర్‌లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతిని బరిలో దింపాడు. కానీ జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ చాణక్యంతో ఉత్తమ్ పద్మావతిని ఓడించడంలో కీలక భూమిక పోషించారు. దీంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా సైదిరెడ్డి గెలుపు ఖాయం అయింది.

రేవంత్ రెడ్డితో విడదీయరాని సానిహిత్యం..

ప్రస్తుత టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డితో కలిసి జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గతంలో కొన్నాళ్లు రెడ్డి హాస్టల్‌లో ఉన్నారు. అక్కడ వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రథసారధిగా ఉండడంతో తాను కూడా పాత పరిచయానికి తోడు తన రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెసే కావడంతో జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీలో చేరుతాడనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీనిపై ఇద్దరి మధ్య చర్చలు కూడా నడిచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు తగ్గ సముచిత స్థానం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు జిన్నారెడ్డి సన్నిహితులు పేర్కొంటున్నారు.

వైఎస్‌తో సంబంధాలు అక్కడి వరకు చేరుస్తాయా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మంచి అనుబంధం, సత్సంబంధాలు నేటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే వైఎస్సార్ టీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. దీనిపై ఆమె పార్టీ అనుచరులు సైతం జిన్నారెడ్డిని సంప్రదించినట్లు టాక్. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరేది పూర్తిగా క్లారిటీ లేనప్పటికీ టీఆర్ఎస్ ను వదలడం మాత్రం ఖాయమని విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. దీనికి కారణాలను కూడా పేర్కొంటున్నారు.

టీఆర్ఎస్‌కు దూరం దూరం..

హుజూర్‌నగర్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసిన జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఉపఎన్నికల్లో విజయం తరవాత టీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని చెబుతున్నారు. ఆయనకు, ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నాడని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఏండ్లు గడిచినా దానిపై ఊసేత్తడం లేదన్న అసహానం జిన్నారెడ్డిలో ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. వీటన్నీటి నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారని టాక్.

షర్మిల పార్టీ నుంచి ఫోన్ వచ్చింది కానీ…

అయితే గత కొద్దిరోజులుగా పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు స్పందించారు. కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ పార్టీల్లో జిన్నారెడ్డి చేరడం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. ‘వైఎస్ షర్మిల పార్టీ నుంచి ఫోన్ వచ్చిందని, పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపారని’ చెప్పారు. కానీ పార్టీ మారేది లేదని చెప్పినట్లు పేర్కొంటున్నారు. అయితే పార్టీ మార్పుపై జిన్నారెడ్డి అనుచరులు మాత్రమే స్పందిస్తున్నారు కానీ, ఆయన నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, పార్టీ మార్పు వార్తలను ఖండించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story