ఏఐఏడీఎంకేపై అన్నామలై వైఖరి మారిందా?

by Ajay kumar |
ఏఐఏడీఎంకేపై అన్నామలై వైఖరి మారిందా?
X

- అమిత్ షా, పళనిస్వామి భేటీ తర్వాత తగ్గిన విమర్శలు

- కార్యకర్తగా పని చేయడానికైనా సిద్ధమన్న అన్నామలై

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వైఖరిలో స్పష్టమైన మార్పు కనపడుతోంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత అన్నాడీఎంకేపై అన్నామలై తన వైఖరిని మార్చుకున్నట్లు కనపడింది. గతంలో అన్నాడీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకపడిన అన్నామలై.. ఇప్పుడు మెతకవైఖరి ప్రదర్శిస్తున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు విషయమై అన్నామలైను ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. మా హోం మంత్రి మాట్లాడారు. ఆయన ఏం చెబుతారో అదే తుది నిర్ణయమని అన్నామలై చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది. ఇటీవలే దీనికి సంబంధించిన సూక్ష్మ విశ్లేషణను అధిష్టానానికి అందజేశానని అన్నారు.

తాను అధిష్టానానికి ఏం చెప్పానో.. రిపోర్టులో ఏం పంపానో వెల్లడించడం తప్పు అవుతుంది. అయితే తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌లో ఎలా ఉండబోతోందో చెప్పాను. అలాగే తమిళ ప్రజల సంక్షేమానికి ఏమి అవసరమో కూడా వివరించానని అన్నామలై చెప్పారు. కాగా, గతంలో అన్నాడీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించిన అన్నామలై.. ఇటీవల తన స్వరాన్ని తగ్గించారు.ఈ విషయంపై మాట్లాడుతూ.. తనకు ఏ పార్టీ మీద, రాజకీయ నాయకుడి మీద వ్యక్తిగతంగా కక్ష లేదని అన్నారు. నేను ఒక సామాన్య కార్యకర్తగా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే చెప్పానని అన్నామలై గుర్తు చేశారు. మరోవైపు అన్నాడీఎంకేను తిరిగి ఎన్డీయేలోకి తీసుకొని రావడానికి బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఒక వర్గానికి నాయకుడిగా ఉన్న కేఏ సెంగొట్టాయన్ ఢిల్లీ పర్యటన తర్వాత అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈరోడ్‌కు చెందిన సీనియర్ నాయకుడైన సెంగొట్టాయన్.. 2017లో జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. కాగా, ఇటీవల ఈరోడ్‌కు సంబంధించిన పలు నియామకాల పట్ల పళనిస్వామితో సెంగొట్టాయన్ విభేదించారు. అప్పటి నుంచి అన్నాడీఎంకే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. కాగా, అన్నాడీఎంకేలో సెంగొట్టాయన్‌ను కూడా ప్రత్యామ్నాయ నాయకుడిగా బీజేపీ చూస్తోందనే ప్రచారం జరుగుతోంది. సెంగొట్టాయన్‌కు వీకే శశికళ మద్దతు కూడా ఉండటాన్ని బీజేపీ పరిశీలిస్తోంది.



Next Story

Most Viewed