Neet ug: మే4న నీట్ యూజీ పరీక్ష.. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం

by vinod kumar |
Neet ug: మే4న నీట్ యూజీ పరీక్ష.. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (Neet Ug) ఎంట్రన్స్ పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. మే4వ తేదీన దేశ వ్యాప్తంగా ఎగ్జామ్ జరగనుండగా అందుకు గాను పట్టిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం సమావేశాలను నిర్వహిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘నీట్- యూజీ పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు జరిగాయి. రవాణా, భద్రత ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాం’ అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

పరీక్ష కేంద్రాల వద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిన భద్రతతో పాటు, జిల్లా పోలీసులు సెక్యురిటీ ఉండనుంది. అంతేగాక ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర సామగ్రి పూర్తి పోలీస్ ఎస్కార్ట్ పర్యవేక్షణలోనే రవాణా చేయనున్నారు. కోచింగ్ సెంటర్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై నిఘా పెట్టనున్నారు. అన్ని సెంటర్లలో తప్పనిసరిగా ఒక ఉన్నతాధికారి నియామకం కానున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు కేంద్రాలను సందర్శిస్తారు.

కాగా, గతేడాది నీట్ పరీక్షలో పేపర్ లీక్, సహా పలు అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. పార్లమెంటులోనూ ఈ పరిణామంపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. పేపర్ లీక్ నిందితులను పట్టుకునేందుకు సీబీఐ దర్యా్ప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు కేంద్ర పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.



Next Story

Most Viewed