- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4.80 లక్షల మెట్రిక్ టన్నులు మాయం.?
దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగికి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈసారి 65 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. అందుకు సరిపడా ఎరువులు ఉన్నాయని భరోసా ఇచ్చింది. కానీ, పరిస్థితులు చూస్తుంటే యూరియా కొరత తప్పేలా లేదు. డిసెంబర్ నెల అవసరాల కోసం కేంద్రం 4.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించింది. ఇప్పటి వరకు 4.22 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి చెబుతున్నారు. ఆ నిలువలు ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు. అధికారులకూ అంతు చిక్కడం లేదు. రైతులు రోజూ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. అంతటా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆధార్ కార్డులతో డీసీఎంఎస్‌ల చుట్టూ వారం రోజులు తిరిగితే తప్ప యూరియా దొరకడం లేదు. సాగు పనులు ఊపందుంకుంటున్న తరుణంలో పొలాలలో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం తిరుగుతున్నారు. మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, నాలుగు రోజుల కిందట మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కర్ణాటకకు మళ్లించారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 60 వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, మనలను కాదని కర్ణాటకకు అదనంగా పంపించారని సమాచారం.
వానాకాలంలోనూ అంతే
ఎరువుల కోసం వానాకాలంలోనూ రైతులు ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఎల్లయ్య అనే రైతు క్యూలో నిలబడి మృతి చెందిన విషయం తెలిసిందే. సరిపడా ఎరువులున్నాయంటూ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోంది. వానాకాలంలో 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే అందుబాటులోకి వచ్చింది. రైతులు సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. సన్నాల సాగు పెరగడంతో ఎరువుల వినియోగమూ పెరిగింది. ఈ యాసంగిలో 15,62,520 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. 7,53,540 మెట్రిక్ టన్నుల యూరియా, 1,25,619 మెట్రిక్ టన్నుల డీఏపీ, 5,08,400 మెట్రిక్ టన్నుల ఎన్పీకే, 1,13,300 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 61,661 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ అవసరమని ప్రతిపాదించారు. యాసంగి పనులు మొదలయ్యాయి. బుధవారం నాటి నివేదిక ప్రకారం ఎనిమిది లక్షల ఎకరాలలో సాగు పూర్తయింది. 1.65 లక్షల ఎకరాలలో వరి వేశారు. ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ సమయంలో యూరియా చాలా అవసరం.
రైతులు యూరియా కోసం వెతుకుతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర నిల్వలున్నాయని అంటున్నా, రైతులు వెళితే లేదంటున్నారు. డిసెంబర్ కోటాలో రాష్ట్రానికి వచ్చిన యూరియా ఎక్కడ ఉందనేది అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం సరిపడా యూరియా ఉండాలని భావిస్తున్నారు. సహకార కేంద్రాలలో అసలే లేవు. దీంతో వచ్చిన యూరియా ఎక్కడ ఉందనేది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. మన రాష్ట్రంలో యూరియా తయారీ లేకపోవడంతో మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాల మీద ఆదారపడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే అంచనా వేసిన ఎరువులను తెచ్చి గోదాములలో నిల్వ చేసుంటే ఈ కష్టాలు వచ్చేవి కాదు. కొన్ని రాష్ట్రాలు ముందస్తుగానే నిల్వలు పెడుతున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాలలో యూరియా కొరత ఎక్కువగా ఉంది. బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాలలో దుకాణాదారులు బస్తా మీద రూ. 50 నుంచి రూ. 100 వరకు పెంచి అమ్ముతున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రైతులు ఆరోపిస్తున్నారు.
సాగు 21.75 శాతం
ప్రస్తుతం సాగు పనులు 21 శాతం దాటాయి. ఈ సీజన్లో మొత్తం 65 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. వాస్తవంగా యాసంగి సీజన్ సాధారణ సాగు 36.93 లక్షల ఎకరాలే. సాగునీళ్లు అందుబాటులో ఉన్నాయని, రెండింతలకు అంచనా వేశారు. మొక్కజొన్న సాగు వద్దన్నా వేస్తూనే ఉన్నారు. 78,282 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ప్రభుత్వం ఎక్కువగా వేయాలని చెబుతున్న కంది ముందుకు సాగడం లేదు. కందులు 605 ఎకరాలలోనే వేశారు. మొక్కజొన్న అత్యధికంగా నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రొ కొత్తగూడెంలో వేశారు.