- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాక్‌డౌన్‌లో ఆ గ్రామమే ఓ పాఠశాల.. అతడే ఓ యోధుడు
దిశ, ఫీచర్స్: దాదాపు ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు తెరుచుకోగా, కొవిడ్ మహమ్మారి భయాలు ఇంకా అందరిలోనూ ఉన్నాయి. కానీ కరోనా విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కొంతమంది విద్యార్థులు ఆన్‌లైన్ విద్యను అభ్యసించారు. అయితే గ్రామాల్లో మాత్రం కొందరికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడం, ఉన్నా ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడంతో చాలామంది విద్యకు దూరమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహమ్మారి భయాలను పటాపంచాలు చేసి, గ్రామస్తులను ఏకం చేస్తూ, ప్రకృతి ఒడిలో పాఠాలు చెప్పి 75 మంది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేశాడు ఓ ఉపాధ్యాయుడు. అయితే మనం ఎంతోమంది ఫ్రంట్‌లైన్ వారియర్స్ కథలు చదివాం. కానీ విద్యారంగంలో అలాంటి యోధుల్లో ఒకరైన కళ్యాణ్ మంకోటి స్టోరీ మీకోసం..
ఉత్తరాఖండ్‌లోని అసో(Aso) గ్రామానికి చెందిన కళ్యాణ్.. ప్రతిరోజూ 35 కిలోమీటర్లు ప్రయాణం చేసి చనోలిలోని జూనియర్ పాఠశాల విద్యార్థులకు నిత్యం పాఠాలు బోధించేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్ వల్ల పోలీసు తనిఖీలు, కొవిడ్ భయాలతో అక్కడికి వెళ్లి రావడం కష్టంగా మారింది. దీంతో విద్యార్ధులకు పాఠాలు చెప్పేందుకు చనోలిలోనే నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా అతడికి సహకరించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకుంటారా? లేదా? అన్న సంశయం అతడిలో ఉండేది. కానీ గ్రామంలోని పెద్దలందరితో సమావేశమై, వారిలో అవగాహన తీసుకురావడంతో వాళ్లు కూడా ఇందుకు అంగీకరించారు. దీంతో మాస్క్, సోషల్ డిస్టెన్స్ కొవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు కళ్యాణ్.
చేయి చేయి కలిసి..
పిల్లలకు పాఠాలు చెప్పేందుకు తరగతి గదుల్ని, ఇంటర్నెట్ మార్గాన్ని అతడు ఎంచుకోలేదు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వారికి బోధించడంతో విద్యార్థులు కూడా రిఫ్రెష్‌మెంట్ ఫీల్ అయ్యారు. వాళ్లు కూడా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపారు. ఇలా అద్భుతంగా సాగుతున్న తమ ఎడ్యుకేషన్ జర్నీకి సాయంగా తన కూతురుతో పాటు, యూనివర్సిటీలో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తన పాత విద్యార్థులను కూడా సమీకరించాడు. వారిలో కొందరు చనోలి గ్రామానికి చెందిన వారు కాగా మిగిలిన వారు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్లంతా సైన్స్, సోషల్, లాంగ్వేజెస్‌తో పాటు మ్యూజిక్, సింగింగ్, మడ్ ఆర్ట్, పేపర్ క్రాఫ్టింగ్ వంటి సృజనాత్మక, కళాత్మక విషయాలపై కూడా బోధనలు సాగించారు. వృక్ష సంపద వల్ల కలిగే లాభాలను, ప్రకృతి అందించే ప్రయోజనాలపై పిల్లల్లో అవగాహన కల్పించారు. సైన్స్ ప్రయోగాలను వినోదాత్మకంగా నేర్పిస్తూ, సరదా ఆటపాటలతో వినూత్న విద్యావిధానాన్ని అవలంభించి గ్రామ ప్రజలతో కళ్యాణ్ అభినందనలు అందుకున్నాడు.
వ్యాపార మెళకువలు..
గ్రామ పెద్దలు కూడా విద్యార్థులతో సంభాషిస్తూ, వారి సంపూర్ణ విద్యకు సహాయం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. తమలోని ప్రతిభాపాటవాలను ప్రపంచానికి ఎలా చాటాలో గ్రామ సభ్యురాలు రేవతి దేవి తన కథల ద్వారా పిల్లలకు తెలియజేయగా, తారా దేవి తనకు వచ్చిన ‘మౌంటెయిన్ డిషెస్’ను పిల్లలతో పంచుకుంది. పాల వ్యాపారం, పశుసంపద, లాక్టోమీటర్ ఉపయోగం వంటి అంశాలపై గ్రామానికి చెందిన భూపాల్ సింగ్ అవగాహన కల్పించాడు. కూరగాయాలు అమ్మే వ్యక్తులు తమ సాగు విశేషాలతో పాటు, వాటిని ఎలా విక్రయించాలి? దాన్ని వ్యాపారంగా ఎలా మలుచుకోవాలో స్వీయ అనుభవాలతో వివరించారు.
కళ్యాణ్ అందిస్తున్న విద్యా బోధన సమగ్రతకు సంకేతంగా నిలవగా, ఓ ఉమ్మడి లక్ష్యం కోసం విభిన్న వ్యక్తులను ఒకచోట చేర్చింది. ఈ విధానంలో పిల్లలు ప్రాపంచిక విషయాలను ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం విశేషం. కళ్యాణ్ బృందంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్కూలు పిల్లలు ఉండగా, తమ మాతృభాష ‘కుమోనిని’ మరచిపోయిన వారు కూడా అతడి చొరవతో ఇప్పుడు అందులో సంభాషించగలుగుతున్నారు. పిల్లలు తమ రెగ్యులర్ పాఠాలను నేర్చుకోవడమే కాకుండా గ్రామంలోని ప్రజలతో విస్తృతమైన చర్చల్లో పాల్గొంటూ కొత్త విషయాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నారు. వివిధ అంశాలపై సర్వేలు నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరించడంతో పాటు, స్థానిక వంటకాలపై కూడా పట్టు సాధించారు. మరుగున పడుతున్న అలనాటి జానపద పాటలను నేర్చుకుంటూ పాడటం విశేషం. గ్రామసమీపంలోని అడవిలోని అరుదైన వృక్షసంపద, ఔషధ మొక్కల విశేషాలను తెలుసుకుని, వాటిపై నోట్స్ రూపొందించారు. ఇలా ప్రాక్టికల్ విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ఈ మోడల్.. పిల్లల సంపూర్ణ విద్యకు.. ది బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని విద్యానిపుణులు చెబుతున్నారు.
“గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారు. రిషికేష్, పౌరి, నైనిటాల్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు.. కొన్ని ప్రాంతాల్లో ఈ మోడల్‌ని అవలంభిస్తున్నారు. కొవిడ్ వల్ల మధ్యాహ్న భోజనంలో అంతరాయం ఏర్పడటంతో సంఘ సభ్యులు, ఉపాధ్యాయుల సహాయంతో దాన్ని కొనసాగించాం. ప్రతి ఇంటి నుంచి తృణధాన్యాలు, కూరగాయలు మాకు అందించి సహకరించారు. కొవిడ్ కష్ట సమయాల్లోనూ గ్రామస్థులు చేయూత అందించడం నిజంగా అభినందనీయం. విద్యార్థులు తమ పశువులను మేపడానికి తీసుకెళ్లినప్పుడు వారి వెంట పాఠ్యపుస్తకాలు, ఇష్టమైన కథల పుస్తకాలను తీసుకెళ్లడం ఎంతో సంతృప్తికరంగా ఉంది” – కళ్యాణ్ మంకోటి, ఉపాధ్యాయుడు