- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణెప్పుడో.?
దిశ, బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ భవిత న్యాయస్థానాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. విచారణ సాగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణపై తీపి కబురు వస్తోందని చెరుకు రైతులు, కార్మికులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ, న్యాయస్థానాల్లో విచారణ వాయిదా మీద వాయిదా పడడం, ఫ్యాక్టరీ భవిత ఎటూ తేలకపోవడంతో రైతులు, కార్మికులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 29న ఢిల్లీ ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో కొనసాగిన విచారణ నవంబర్ 10కి వాయిదా పడింది.
ప్రైవేటీకరణ నాటి నుంచి నేటి వరకు
ఉమ్మడి రాష్ట్రంలో 2002లో టీడీపీ హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ బోధన్‌తో పాటు, ముత్యంపేట (జగిత్యాల), మంబోజిపల్లి (మెదక్) యూనిట్లను ప్రైవేటీకరించారు. నాటి నుంచి నిజాం షుగర్స్‌కు సంబంధించిన అనేక అంశాలపై రైతులు, కార్మిక సంఘాల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనూహ్యంగా 2015 డిసెంబర్ 23న ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి మూడు ఫ్యాక్టరీలను మూసివేసింది. లే ఆఫ్ చట్ట విరుద్ధమని, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కార్మికులు ఫిర్యాదులు చేశారు. దీంతో 2016లో కార్మిక సంఘాలు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చర్చలు జరిపారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో చర్చల నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, 2017 ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం కేసును లేబర్ కోర్టుకు అప్పగించింది. కార్మికుల వేతనాలు, లే ఆఫ్ సమస్య అంశాలపై అప్పటి నుంచి లేబర్ కోర్టులో విచారణ సాగుతోంది. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు.
మరో మలుపు..
ఫ్యాక్టరీ మూసివేత, పునరుద్ధణ సమస్య పరిష్కారం కోసం 2017 సెప్టెంబర్‌లో ఎన్‌సీఎల్‌టీ ( నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ రంగ ప్రవేశం చేసింది. ఈ ట్రిబ్యునల్‌కు ఐపీఆర్ (ఇంటెర్మీ రిసోల్యూషన్ ప్రొఫిషనల్)గా రాచర్ల రామకృష్ణ గుప్తా నియమితులై, అదే ఏడాది అక్టోబర్‌లో ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగింది. 2019 జూన్3న ఎన్‌డీఎస్‌ఎల్ లిక్విడేషన్‌కు ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించి స్టే తెచ్చింది. అప్పటి నుంచి ఈ ట్రిబ్యునల్‌లో విచారణ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకు వచ్చి విధానపరంగా నిర్ణయం తీసుకుంటేనే సమస్యకు ముగింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే నిజాంషుగర్స్ భవిత ఆధారపడి ఉంది.
ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోవాలి
ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీలో కొనసాగుతున్న విచారణకు ముగింపు పలికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఫ్యాక్టరీ మూసివేతతో కార్మిక కుటుంబాల బతుకులు అధోగతి పాలయ్యాయి. లేఆఫ్ నాటి నుంచి బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలి.
– ఉపేంద్ర, ఎన్‌డీఎస్‌ఎల్ మజ్దూర్ సభ యూనియన్ ప్రధాన కార్యదర్శి