తగ్గిన వాట్సాప్ నిడివి… యూ ట్యూబ్ స్ట్రీమింగ్ క్వాలిటీ

by Sujitha Rachapalli |
తగ్గిన వాట్సాప్ నిడివి… యూ ట్యూబ్ స్ట్రీమింగ్ క్వాలిటీ
X

దిశ వెబ్ డెస్క్ : ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. దాంతో దేశమంతా లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇల్లకే పరిమితమయ్యారు. దాంతో టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆఫీసులు లేవు.. సినిమా థియేటర్లు లేవు.. పార్క్ లు లేవు… మరి ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఈ సమయంలో ఎంటర్టైన్ మెంట్ కావాలంటే.. ఏం చేయాలి.. అలా ఎంతోమందికి మొబైల్ , పీసీలే దిక్కయ్యాయి. దాంతో వాటి వినియోగం పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ స్టేటస్ నిడివి, యూ ట్యూబ్ స్ట్రీమింగ్ క్వాలిటీలను తగ్గించారు.

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. అందువల్లే లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. మనదేశంలో చాలా మంది ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. కరోనా కథనాల కోసం, వార్తల కోసం, వినోదానికి ఇలా అన్నింటికీ ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. సినీ పరిశ్రమ కూడా తమ అప్డేట్ లన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తుంది. అవే కాకుండా కరోనా గురించి తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసుకునేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణాల వల్ల ఇంటర్నెట్ పై లోడ్ రోజురోజుకీ ఎక్కువైపోయింది. భవిష్యత్తులో డేటా అయిపోయే ప్రమాదం ఉండటంతో ప్రముఖ టెక్ సంస్థలన్నీ దీనికి తగ్గట్లు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ కూడా తన స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించింది. దీంతో పాటు ప్రముఖ ఓటీటీ కంటెంట్ ప్రొవైడర్లు కూడా హై డెఫినిషన్ కాకుండా స్టాండర్డ్ డెఫినిషన్ లోనే కంటెంట్ ను అందిస్తున్నారు.

స్టేటస్ 15 సెకన్లే :

మన దేశంలో అత్యధిక మంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ‘వాట్సాప్’. దీని వినియోగం కూడా భారీగా పెరిగింది. ఇంతకుముందు వాట్సాప్ స్టేటస్ ను 30 సెకన్ల పాటు పెట్టే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 15 సెకన్లకు తగ్గించారు.
ఈ కీలక నిర్ణయిం తీసుకోవడం వల్ల ఇంటర్నెట్ వినియోగం కాస్త మేరకైనా అదుపులో ఉంటుందని ఆ సంస్థ ఉద్దేశం. దీనికి తోడు వీడియో నిడివి తగ్గడంతో సర్వర్ పై పడే భారం కూడా తగ్గనుంది. వాట్సాప్ కు సంబంధించిన సమాచారాన్ని అందించే WABetaInfo తెలిపిన దాని ప్రకారం ఈ మార్పు మనదేశంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం సర్వర్ మీద పడే ట్రాఫిక్ భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదే బాటలో ఓటీటీ :

సినిమా థియేటర్నీలు మూత పడ్డాయ్. సినిమా షూటింగ్ లు కూడా బంద్ అయ్యాయి. సీరియల్స్ కూడా రావడం లేదు. టీవీ చూద్దామంటే… అంతటా కరోనా వార్తలే. అందుకే చాలామంది సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, ఈటీసీ, జీ5 వంటి ఓటీటీ సర్వీస్ లపై ఆధార పడుతున్నారు. దీంతో ఆ ఓటీటీ సర్వీసులు కూడా తమ వీడియోల నాణ్యతను తగ్గిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గేమింగ్ యాప్ లకు తప్పలేదు :

కరోనా వైరస్ భయంతో దేశ ప్రజలందరూ చాలా వరకు ఇళ్లలోనే గడుపుతున్నారు. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైంది. గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక తేల్చింది. గేమింగ్ యాప్ ల వినియోగం చాలా ఎక్కువగా పెరిగింది. దీంతో నెట్ వర్క్ పై భారీగా భారం పడుతుండటంతో లోడ్ ఎక్కువగా ఉండే సమయంలో గేమింగ్ డౌన్ లోడ్ పై కూడా మైక్రోసాఫ్ట్, సోనీ వంటి సంస్థలు పరిమితులు విధిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం డేటా వాడకం విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే భవిష్యత్తులో ఇంటర్నెట్ విషయంలో కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. అత్యవసరమైతే తప్ప.. డేటాను వినియోగించకపోవడమే అత్యుత్తమం. ముందు ముందు రోజుల్లో ఇంటర్నెట్ సేవలకు డేటా ఎంతగానో అవసరం. సో.. పొదుపుగా డేటాను వినియోగించంది.

Tags : corona virus, internet, data, whatsapp, social media, youtube, amazon prime, netflix

Advertisement

Next Story