ఇనుగాల పెద్దిరెడ్డికి కేసీఆర్‌ ఇచ్చే స్థానం ఏంటి..?

by Anukaran |   ( Updated:2021-08-02 22:48:04.0  )
ఇనుగాల పెద్దిరెడ్డికి కేసీఆర్‌ ఇచ్చే స్థానం ఏంటి..?
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలతో ఇక్కడ నిధుల వరదే కాదు.. పదవుల పందేరం కూడా సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన ఈ నియోజకవర్గంలో వచ్చే ఉప ఎన్నికల్లో గులాబీ గుభాళించాలన్న సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అన్నింటా హుజురాబాద్‌కే ప్రాధాన్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గాన్నే ఎంపిక చేసిన సీఎం, రెండో విడుత గొర్రెల పంపిణీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. రేషన్ కార్డుల దరఖాస్తుకు రాష్ట్రం అంతా ఓ రకంగా ఉంటే హుజురాబాద్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇవే కాకుండా స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు కేటాయిస్తున్నారు.

పదవుల పందేరంలోనూ…

ఇక పోతే నామినేటెడ్ పదవుల పందేరంలోనూ హుజురాబాద్‌కే పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే స్థానిక టీఆర్ఎస్ నాయకుడు బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీకి నామినేట్ చేశారు. దీంతో కీలక పదవులను కూడా ఈ నియోజకవర్గానికి చెందిన నాయకులకే అప్పగిస్తానన్న సంకేతాలను చేతల్లోనే చూపిస్తున్నారు సీఎం. గతంలో ఎంతో మందికి మాట ఇచ్చినప్పటికీ వారికి మొండి చేయి ఇచ్చారన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న లక్ష్యంతోనే సీఎం ముందుగానే పదవులను అప్పగిస్తున్నారు. దీనివల్ల టీఆర్ఎస్‌‌పై ఇతర పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టవచ్చని భావిస్తున్నారు కేసీఆర్.

పెద్దిరెడ్డి పదవి ఏంటి..?

గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డికి కూడా నామినేటెడ్ పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేబినెట్ హోదా ఉన్న పదవిని పెద్దిరెడ్డికి సీఎం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఎవరు వచ్చినా వారికి ముఖ్యమైన పదవిని ఇచ్చి పార్టీ బలాన్ని పెంచాలని యోచిస్తున్నట్టుగా అర్థం అవుతోంది.

Advertisement

Next Story