సీఎం కేసీఆర్ హామీ ఏమైంది?.. 3 నెలలు గడుస్తోంది

by Shyam |
cm kcr, uttam kumar reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తే స్పందించి హామీ ఇచ్చి 3 నెలలు గడుస్తోందని.. ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూ ప్రజల మృతి చెందుతున్నా ప్రభుత్వం కనీస స్పందన లేకుండా దుర్మార్గంగా, అమనవీయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోమవారం పంచాయతీ రాజ్ సంఘటన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా విషయంలో అత్యంత దయనీయంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. రోగులను తరలించడానికి అంబులెన్సులు లేవు, ఆసుపత్రులలో బెడ్స్ లేవు, రోగులకు ఇంజెక్షన్లు లేవు, మందులు లేవు ఇంత ఘోరమైన పాలన ఎక్కడా లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనాకు ఉచిత చికిత్సలు చేస్తుంటే తెలంగాణలో ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మార్చి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలకు మందులు సరఫరా చేసే శక్తి ఉన్నా.. మనకు మందులు లేకుండా అయ్యాయని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో కోవాగ్జిన్, రెమిడిసివిర్ ఇంజక్షన్ తయారవుతున్నా మన రాష్ట్రంలో రోగులకు వ్యాక్సిన్ లేదు.. ఇంజక్షన్ లేదని దుయ్యబట్టారు.

21న కరోనా రోగులకు సాయం చేయాలి..

ఈ నెల 21న రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా కరోనా రోగులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ నాయకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, కరోనా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలని పిలుపు నిచ్చారు. కరోనా టెస్టులు చేయించడం, వాక్సిన్లు వేయించడం, మందులు, ఆహారం, మాస్కులు పంపిణీ చేయాలని, అవసరమైన వారిని ఆసుపత్రికి చేర్చడం, బెడ్స్ ఇప్పించడం, ఇంజెక్షన్లు, వెంటిలేటర్లు ఇప్పించడంలాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈనెల 18 నుంచి రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని రోగులు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సహాయం తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఏఐసీసీ ఇంచార్జి జయంతి నటరాజన్, తెలంగాణ ఇంచార్జి కిరణ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Advertisement

Next Story