పోలీసుల వీక్లీ ఆఫ్.. కలగా మిగిలే..!

by Shyam |
పోలీసుల వీక్లీ ఆఫ్.. కలగా మిగిలే..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్ర పోలీస్ శాఖలో వారాంతపు సెలవు చిరకాల స్వప్నంగా మారింది. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా పనిచేసే పోలీసుశాఖకు వారంలో ఒక రోజు సెలవు లేకపోవడంతో సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. డిపార్ట్మెంట్లో వీక్లీ ఆఫ్ దశాబ్దాలుగా సాగుతున్న సమస్య. దీన్ని అధిగమించేందుకు గతంలో ఎన్నో ప్రయాత్నాలు జరిగినా సరిపడా సిబ్బంది లేకపోవడంతో సక్సెస్ కావడం లేదు. రోజంతా విరామం లేకుండా విధుల్లో కొనసాగుతుండటంతో సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలలో ప్రమోషన్ల అంశంపై కసరత్తు జరుగుతుండగా.. వీక్లీ ఆఫ్ కంటే ముందుగా ప్రమోషన్లు కల్పించాలని కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

విఫలమవుతున్న ప్రయోగం..

దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వీక్లీ ఆఫ్ పద్ధతి అమల్లో ఉంది. కానీ, ఒక్క పోలీస్ శాఖలో మాత్రమే వారాంతపు సెలవు అమలు కావడం లేదు. దీంతో కుటుంబానికి, పిల్లలకు దూరంగా ప్రతిరోజూ దాదాపు 18 నుంచి 20 గంటలు పోలీసులు విధుల్లో ఉండాల్సి వస్తోంది. అయితే, పోలీసులు.. ముఖ్యంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐ, ఎస్ఐ స్థాయి సిబ్బంది అత్యధికంగా క్షేత్ర స్థాయిలోనే పనిచేస్తుంటారు. దీంతో వీరు నిరంతరం విసుగు, మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో పోలీసులకు ఉన్న చిరకాల స్వప్నం వీక్లీ ఆఫ్ అంశాన్ని ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశంతో గతంలో పలుమార్లు ఉన్నత స్థాయి చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ స్థాయి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పోలీసులకు వీక్లీ ఆఫ్ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందిలో ప్రతి రోజూ 80 శాతం విధుల్లో ఉండేలా, మిగతా 20 శాతం సెలవు తీసుకునేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఈ ప్రకారం రెండేళ్ల క్రితం రాష్ట్రంలోని కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కానీ, 2018 ఎన్నికల దగ్గర్నుంచి బందోబస్తు తదితర ఎన్నికల విధుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వీక్లీ ఆఫ్ల లు ఇవ్వడం, తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు వెసులుబాటు ఉంటేనే ఆఫ్ ఇవ్వడం కుదురుతోందనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వీక్లీ ఆఫ్ అందని ద్రాక్షగానే తయారయ్యింది. యూనిఫాం డిపార్ట్మెంట్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో విధులకు హాజరు కావడం తప్పనిసరి అవుతోంది. హైదరాబాద్ లాంటి నగరాలలో మాత్రం రాత్రిపూట విధులు నిర్వహించిన వారు మరుసటి రోజు వీక్లీ ఆఫ్ తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నా.. అవసరాలను బట్టి మళ్లీ పిలిపించుకుంటున్నారు.

సిబ్బంది కొరత కారణంగానే..

పోలీస్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో దాదాపుగా 80 వేలకు పైగా సిబ్బంది ఉండాలని నిబంధనలు చెబుతుండగా.. కేవలం 50 వేల సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇంకా 30 వేలకు పైగా పోస్టులు పోలీసు శాఖలో కొరత ఉంది. ఈ పోస్టులను భర్తీ చేసినట్లయితే నిబంధనల ప్రకారం ప్రతిరోజూ 20 శాతం సిబ్బంది వీక్లీ ఆఫ్ తీసుకోవడం సాధ్యం అవుతోంది. వీటిలో అత్యధికంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐ, ఎస్ఐ స్థాయి అధికారులు దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో పోలీసులు అంతా విధుల్లో ఉండటంతో పోలీస్ స్టేషన్లలో సిబ్బంది లేక బోసిపోయాయి. వాస్తవానికి రాష్ట్ర జనాభా దామాషా ప్రకారం మనకు ప్రతి 476 మందికి ఒకరు పోలీస్ ఉండాల్సి ఉంది. కానీ, 764 మందికి కేవలం ఒకే ఒక్క పోలీస్ ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించేందుకు కసరత్తుకు చేస్తుండగా, అందులో పోలీస్ శాఖకు చెందిన దాదాపు 20 వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒకవేళ 20 వేల పోస్టులు భర్తీ చేసినా వారాంతపు సెలవుకు సరిపడా సిబ్బంది ఉండే అవకాశం లేదు.

ప్రమోషన్లను కూడా తేల్చాలి..

వీక్లీ ఆఫ్ సమస్య అలా ఉండగా, క్షేత్ర స్థాయి అధికారుల్లో అగ్రభాగం కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకం. వీరికి 30 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల్లో ప్రమోషన్ల అంశాన్ని కూడా తేల్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ పరిస్థితుల్లో వీక్లీ ఆఫ్ సంగతి తర్వాత కానీ, మాకు ముందుగా ప్రమోషన్ల విషయాన్ని తేల్చాలని కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా, మా కండ్ల ముందే ఎస్ఐగా జాయిన్ అయిన వారు రెండు ప్రమోషన్లు అందుకుని ఏసీపీ స్థాయిలో ఉన్నారని పలువురు కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలలో ప్రమోషన్లను తేల్చే క్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లకు కూడా పదోన్నతులు కల్పించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed