వారోత్సవాల సమయంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ

by Sridhar Babu |   ( Updated:2021-08-03 22:21:30.0  )
వారోత్సవాల సమయంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
X

దిశ, భద్రాచలం: జూలై 28న ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వారోత్సవాల సమయంలో మావోయిస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఈనెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో పీఎల్‌జీఏ బెటాలియన్ సభ్యుడు మడివి ఉంగాల్ అలియాస్ చోటు (ఛత్తీస్‌గఢ్) మరణించాడు. ఈ ఘటన మినహా ఈసారి వారోత్సవాలు ప్రశాంతంగానే ముగిశాయని చెప్పవచ్చు. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో భారీగా భద్రతా బలగాలు మోహరించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో పోలీసులు గస్తీ తిరిగారు. ప్రధాన కూడళ్ళలో కాపుగాచి రేయింబవళ్ళు తనిఖీలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో పలు గ్రామాల్లో మావోయిస్టు అమరవీరుల స్థూపాలను జవాన్లు కూల్చివేసి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు చెక్ పెట్టారు. డీఆర్‌జీ, ఎస్‌టిఎఫ్, సీఆర్‌పిఎఫ్ బలగాలకు తోడు ఈసారి బస్తర్ ఫైటర్స్‌గా మహిళా కమాండోలు బరిలోకి దిగారు. అయినప్పటికీ భద్రతా బలగాల కన్నుగప్పి మావోయిస్టులు తమకు పట్టున్న ప్రాంతాలలో వారోత్సవ సభలు, సమావేశాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు మీడియాకి వీడియోలు విడుదల చేశారు.

వారోత్సవాలపై పోలీసుల ఆరా..!

నిన్నటి వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఎక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు ఏ స్థాయి నాయకులు హాజరు కానున్నారని ఆరా తీసిన పోలీసు నిఘా వర్గాలు, ఇప్పుడు వారోత్సవాలు ముగియడంతో ఎక్కడెక్కడ వారోత్సవ సభలు, సమావేశాలు జరిగాయి. అగ్రనేతలు హాజరయ్యారా ? సంస్మరణ సభల సందర్భంగా కొత్త రిక్రూట్‌మెంట్స్ ఏమైనా జరిగాయా అనేది ఆరా తీస్తున్నారు. వారోత్సవాలకు ఎవరి నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందాయనేది పోలీసులు కూపీ లాగుతున్నారు.‌

Advertisement

Next Story

Most Viewed