ఆ హైవేకు..మా భూములివ్వం

by Shyam |
ఆ హైవేకు..మా భూములివ్వం
X

ఖ‌మ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి అధికారులు బ‌లవంతంగా భూసేక‌ర‌ణ చేప‌డుతున్నారు. హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులు రైతుల అంగీకారంతో సంబంధం లేకుండానే ఏక‌ప‌క్షంగా ముందుకెళ్తున్నారు. దీంతో బాధిత రైతుల్లో ప‌రిహారంపై భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ప‌రిహారం చెల్లింపుపై స్పష్టత ఇవ్వకుండానే తమ పంట‌పొలాల గుండా స‌ర్వే చేస్తుండడంపై రైతులు ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. హైవే అథారిటీ నిబంధ‌న‌ల ప్రకారం భూములు ఇవ్వాల్సిందేనంటూ భ‌య‌పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, ఖ‌మ్మం:
ఖ‌మ్మం ప‌ట్టణ శివారు నుంచి ఏపీలోని దేవ‌ర‌ప‌ల్లి వ‌ర‌కు 163 కిలోమీట‌ర్ల పొడ‌వున గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. దీనికి సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఖమ్మం రూరల్‌, చింతకాని, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లోని పంట పొలాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జ‌ర‌గ‌నుంది. ఇందులో 92 కిలోమీటర్ల మేర రెండువేల ఎకరాల భూసేకరణ చేస్తోంది. మొత్తం10 మండలాల్లోని 32 గ్రామాలకు చెందిన 2 వేల మంది రైతులు ఇక్కడ సాగు చేస్తున్నారు. రైతులు అభ్యంతరం తెలిపినా పోలీసు బందోబస్తు మధ్య 32 గ్రామాల్లోనూ బలవంతంగా భూ స‌ర్వే పూర్తి చేసింది.

ఐదు మండలాల్లోనే స‌భ‌లు
క‌ల్లూరు రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని స‌త్తుప‌ల్లి, వేంసూరు, పెనుబ‌ల్లి, క‌ల్లూరు, త‌ల్లాడ మండ‌లాల్లో విచార‌ణ స‌భ‌లు నిర్వహించారు. ఈ ఐదు మండ‌లాల్లో భూములు కోల్పోతున్న ఏ ఒక్క రైతు కూడా అధికారుల ప్రతిపాద‌న‌లకు అంగీక‌రించ‌లేదు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రుల‌కు విన‌తిప‌త్రం అంద‌జేసేందుకు బాధిత రైతులు స‌మాయత్తమ‌వుతున్నారు. 32 రెవెన్యూ గ్రామాల్లో తమకున్న అర ఎక‌రం, ఎక‌రం భూములు కోల్పోతూ పూర్తిగా భూమిలేకుండా ఉన్న వాళ్లు దాదాపుగా 500 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ, బీసీలు, ఎస్టీల సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఎక్కువ మంది ఉండ‌టం గ‌మ‌నార్హం.

రెండు పంట‌లు పండే భూములే
జిల్లాలో 92 కిలో మీట‌ర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే కింద పోతున్న భూముల‌న్నీ కూడా పుష్కలంగా సాగునీటి వ‌స‌తి క‌లిగిన రెండు పంట‌లు పండే భూములే. నాగార్జున సాగ‌ర్ లెఫ్ట్ కెనాల్‌, లంకాసాగ‌ర్‌, వైరా రిజ‌ర్వాయ‌ర్‌, కొదుమురు లిఫ్ట్ ఇరిగేష‌న్‌తో పాటు అనేక చెరువుల ఆయ‌క‌ట్టుకు సంబంధించిన భూములే. ఏడాదంతా సాగునీటి సౌక‌ర్యం క‌లిగిన భూములు కావ‌డంతో రైతులు భూములు ఇచ్చేది లేద‌ని తెగేసి చెబుతున్నారు. ఎక‌రానికి రూ.50 ల‌క్షలు, రూ.కోటి, ఖ‌మ్మం ప‌రిస‌ర ప్రాంతాల్లోని భూముల‌కైతే కోటిన్నర వ‌ర‌కు ధర ప‌లుకుతోంది. అయితే ప్రభుత్వం ఇవ్వనున్న పరిహారం మొత్తం స‌హేతుకంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ స‌ర్వేకు అంగీక‌రించండి.. లేదంటే వ‌చ్చే ప‌రిహారం కూడా రాదని అధికారులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ప‌చ్చటి పొలాల మీదుగా రోడ్డు నిర్మాణం వ‌ద్దు, త‌మ బ‌తుకుల‌ను రోడ్డు పాలు చేయ‌వ‌ద్దంటూ మొత్తుకున్నా విన‌డం లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సేక‌ర‌ణ స‌ర్వే పూర్తి చేశామ‌ని చెబుతూ ప‌త్రిక‌ల్లో ప్రకట‌న‌లు ఇచ్చారు. ఈ ప్రకట‌న‌ల్లో భూములు కోల్పోతున్న రైతుల పేర్లు గ‌ల్లంత‌య్యాయి. అలాగే కొంత‌మంది పేర్లు తారుమార‌య్యాయి. భూములు కోల్పోతున్న ప‌రిమాణం త‌క్కువ‌, ఎక్కువ‌లుగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

ఎంతిస్తారో చెప్పాలి
మూడేళ్లుగా మా భూముల్లో స‌ర్వే నిర్వహిస్తున్నారు. న‌ష్టప‌రిహారం ఎంతిస్తారో తేల్చిన త‌రువాత‌నే స‌ర్వే చేయాల‌ని, లేక‌పోతే భూముల్లోకి రావ‌ద్దన్నాం. మేం గట్టిగా వ్యతిరేకించినా ఎంతిస్తారో చెప్పడం లేదు. మా భూములు బ‌హిరంగ మార్కెట్లో కోటిపైనే ప‌లుకుతున్నాయి. ప్రభుత్వం నామ‌మాత్రపు ప‌రిహారం ఇస్తే మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు.
– భూక్యా మ‌ల్సూర్‌, తెల్దారుపల్లి

రూ.కోటి ఇచ్చినా మా భూములివ్వం
నాకు రెండెక‌రాల భూమి ఉంది. గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ‌కు 20 కుంటలు పోయింది. గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారికి మిగిలింది పోతోంది. నా భూమి పక్కన కోటిన్నర ప‌లుకుతోంది. గ‌తంలో సర్కారు రూ.13 ల‌క్షలు ఇచ్చింది. ఇప్పుడు కోటి ఇచ్చినా ఇచ్చేది లేదు. ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం తీసుకుంటే మేము ఏం తిని బ‌తకాలి. ఎన్ని డ‌బ్బులు ఇచ్చినా మా భూములిచ్చేది లేదు.
– తుమాటి రామ‌నర్సయ్య, మ‌ద్దుల‌ప‌ల్లి

హైకోర్టు ఆదేశాలు పాటించాలి
ఎన్‌హెచ్‌ 365 రహదారిని ఖ‌మ్మం-స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేట మీదుగా దేవ‌ర‌ప‌ల్లి వ‌ర‌కు విస్తరించుకోవాలి. ఈ కేసు హైకోర్టు విచార‌ణలోనే ఉండ‌గానే భూమిని సేక‌రిస్తున్నారు. సాగు భూముల‌కు ఆటంకం క‌ల‌గించొద్దని జులైలో మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం తుది తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పి పనుల్లో స్పీడ్ పెంచారు. – కాస‌ర రాజశేఖ‌ర్‌రెడ్డి, అడస‌ర్లపాడు

Advertisement

Next Story

Most Viewed