బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల తూటాలు

by Shyam |
BJP and TRS
X

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. కొవిడ్ నియంత్రణలో కేంద్రం దారుణంగా విఫలమైందని మంత్రులు అంటుంటే.. మీ చేత కానీ తనంతోనే వైరస్ కట్టడి కావడం లేదని బీజేపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. వ్యాక్సిన్లు,ఆక్సిజన్​కొరతపై మొదటి నుంచి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్​కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కొవిడ్​విస్తృతిని తగ్గించేందుకు అవసరమైన సహకారాన్ని అందించడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని చెబుతూ బీజేపీని ఇరకాటంలోకి నెట్టే యత్నం చేశారు. ముందు చూపు లేకుండా కేంద్రం వ్యవహరించిన తీరుతోనే రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు పెరిగాయంటూ కేంద్ర సర్కార్​తీరునూ ప్రజా క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్​వచ్చి ఐసోలేషన్ లో ఉన్న మున్సిపల్,ఐటీ మంత్రి కేటీఆర్​కూడా వారం క్రితం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ ధరలో తేడాలేంటంటూ నిలదీశారు.

రాష్ట్ర మంత్రులు కేంద్రం మీద చేసిన కామెంట్స్​పై బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించారు. కొవిడ్ విషయంలో కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుండడంతో.. గత కొన్ని రోజులుగా కమలనాథులు టీఆర్ఎస్, స్టేట్​ గవర్నమెంట్​పై కౌంటర్​ఎటాక్​ స్టార్ట్​చేశారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావైతే వైద్యమనేది ఉమ్మడి జాబితాలోకి వస్తుందనే విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో అవసరమైన డాక్టర్లు,స్టాఫ్​నర్సులు,ఉద్యోగులను భర్తీ చేసుకొనే బాధ్యత రాష్ట్రానికి లేదా..? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్​చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డికె అరుణ వ్యాక్సిన్​ధరపై మంత్రి కేటీఆర్​చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. వ్యాక్సిన్​రేట్​విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందంటూ కేటీఆర్​చేసిన కామెంట్స్​ను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సంబంధిత కంపెనీలతో మాట్లాడుకొని ధరలను తగ్గించుకోలేవా..? అంటూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​కూడా కేంద్రంపై రాష్ట్ర మంత్రులు చేసిన కామెంట్స్​పై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కరోనా మరణాలన్నీ రాష్ట్ర సర్కార్​హత్యలేనంటూ బుధవారం సంజయ్​ ఘాటుగానే బదులిచ్చారు.

అయితే బీజేపీ,టీఆర్ఎస్ మధ్య కరోనా కట్టడిపై మాటల–తూటాలు పేలుతున్న వేళ గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టించాయి. కేంద్రం నిర్వాహకం వల్లే మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్​ను అందించలేకపోతున్నామని ఈటెల చెప్పారు. సెంట్రల్​గవర్నమెంట్​కు కొవిడ్​నియంత్రణపై ముందు చూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో మరణాలూ సంభవిస్తున్నాయని తాజాగా ఆయన వ్యాఖ్యనించారు. దీంతో రెండు పార్టీల మధ్య మరోసారి పరిస్థితి హీటు పుట్టించేలా మారింది.

Advertisement

Next Story

Most Viewed