భారత మార్కెట్లోకి 'టైగన్' మోడల్.. ధర ఎంతంటే

by Harish |   ( Updated:2021-09-23 05:57:52.0  )
taigun
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లోకి తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగన్ కారును లాంచ్ చేసింది. మరికొద్దిరోజుల్లో ఈ వాహనం అందుబాటులో ఉంటుందని, రూ. 10.49- 17.49 లక్షల మధ్య దీని ధరను నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య తరహా ఎస్‌యూవీ విభాగంలో 10 శాతం వాటాను లక్ష్యంగా కలిగి ఉన్నామని, తమ కొత్త టైగన్ మోడల్ ఈ కొరతను తీర్చగలదని సంస్థ ప్యాసింజర్ వాహనాల బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల నుంచి ఆర్థికవ్యవస్థ బయటపడుతున్న తరుణంలో విక్రయాలు ఆశించిన స్థాయిలో జరుగుతాయని, పండుగ సీజన్‌లోనే వినియోగదారుల కోసం ఈ వాహనాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఆశిష్ తెలిపారు. ఈ విభాగంలో ఇప్పటికే హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ మోడళ్లు మార్కెట్లో మెరుగైన అమ్మకాలను సాధిస్తున్నాయి.

అయితే, వోక్స్‌వ్యాగన్ మోడల్ వీటికి గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టైగన్ మోడల్ కారును భారత వాహనదారులను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చామని, అందుకు అనుగుణంగా అధునాతన ఫీచర్లను ఇందులో అందిస్తున్నట్టు ఆశిష్ గుప్తా వివరించారు. ఈ మోడల్ కోసం ఇప్పటికే 12 వేలకు పైగా ప్రీ-ఆర్డర్లు వచ్చాయన్నారు. ‘వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మధ్య తరహా ఎస్‌యూవీ విభాగంలో కనీసం 10 శాతం వాటాను సాధించాలనుకుంటున్నాం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేపట్టామని’ ఆశిష్ పేర్కొన్నారు. సరికొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ మోడల్‌లో 10 అంగుళాలకు పైగా పెద్ద టచ్‌స్క్రీన్‌తో పాటు లైవ్ ట్రాకింగ్, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో డిమ్ రియర్‌వ్యూ మిర్రర్, ఆటోమెటిక్ ఏసీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లాంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed