నా జీవితంలో ఇంగ్లండ్ పర్యటనే కీలకం: విరాట్ కోహ్లి

by Shyam |
నా జీవితంలో ఇంగ్లండ్ పర్యటనే కీలకం: విరాట్ కోహ్లి
X

దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతి సిరీస్‌లో రికార్డులు నెలకొల్పుతూ ముందుకెళ్తున్నాడు. అయితే, తన కెరీర్‌లో 2014 ఇంగ్లండ్ పర్యటనే కీలకమైందని అంటున్నాడు. ఎవరైనా బాగా రాణించిన పర్యటనను గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఘోరంగా విఫలమైన పర్యటనను గుర్తు పెట్టుకోవడం వెనుక కారణాన్ని వివరించాడు. యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నిర్వహించే ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ అనే కార్యక్రమంలో కోహ్లి పలు విషయాలను పంచుకున్నాడు. చాలా మంది క్రికెటర్లు బాగా రాణించిన పర్యటనను మైలు రాళ్లుగా భావిస్తారు. కానీ, తనకు మాత్రం విఫలమైన టూరే మైలు రాయి అని భావిస్తానని కోహ్లి చెప్పాడు. ఆ పర్యటనలో విఫలమైన తర్వాత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కోచ్ రవిశాస్త్రి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను త్వరలో బీసీసీఐ విడుదల చేయనున్నట్లు కోహ్లి చెప్పాడు. ఫిట్‌నెస్ విషయంలో తన తల్లి సరోజ్ కోహ్లి బాధపడేదని చెప్పారు. కాస్తా బరువు తగ్గినా తనకేమైనా అయ్యిందేమోనని బెంగ పడేదన్నాడు. ఏ తల్లయినా తన కొడుకు గురించి అలాగే ఆలోచిస్తుందని కోహ్లి అన్నాడు.

Advertisement

Next Story