ఆ అమ్మాయికి గ్రామస్థులే అమ్మానాన్న అయ్యారు!

దిశ, వెబ్ డెస్క్: మానవత్వం కూడా కరువవుతున్న ఇలాంటి సమయంలో ఒక మవాసులు ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన యువతి పెళ్ళికి గ్రామస్థులే తల్లిదండ్రులు అయ్యారు. నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన దాసరి మమత తల్లిదండ్రులు మల్లయ్య, సోమమ్మ సుమారు 15 ఏళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుండి మమత తన నానమ్మ సౌనమ్మ వద్దనే ఉంటోంది.

రెక్కాడితే గానీ డొక్కాడని దాసరి సౌన్నమ్మ వృద్ధాప్య కారణంగా ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పెళ్లి వయసు వచ్చినా మనువరాలి పెళ్లి చేయడానికి డబ్బులు లేక కుంగిపోతోంది. ఇదే మయంలో మమతకు మంచి సంబంధం వచ్చింది. జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామానికి చెందిన మహేష్ కి, అతని కుటుంబసభ్యులకు అమ్మాయి నచ్చడంతో పెళ్ళికి ఒప్పుకున్నారు.

కానీ వివాహం జరిపించడానికి ఆర్ధిక స్థోమత లేదు. ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగు వారు ఎవరికి తోచినంత వారు డబ్బు జమచేసి… మమత వివాహాన్ని గురువారం ఘనంగా జరిపించారు. దానికి తోడు గ్రామంలోని యువత మేమున్నాం అంటూ ముందుకు వచ్చి ఆమె వివాహానికి సుమారు రూ.80 వేలు కానుకగా అందించారు. తన వివాహానికి సహాయం చేసి… తనకూ, తన నానమ్మకు అండగా నిలబడిన గ్రామస్థులకు మమత ఆనందబాష్పాలతో కృతజ్ఞతను తెలిపింది.

Advertisement