పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదు?

by Shyam |
పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కరోనా ఎఫెక్ట్​తో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 18 నెలల తర్వాత సెప్టెంబర్​ 1న రాష్ట్రవ్యాప్తంగా రీ ఓపెన్​ అయ్యాయి. నెలల తరబడి మూసి ఉండడంతో స్కూళ్లలోని తలుపులు, కిటికీలు చెదలు పట్టాయి. స్లాబులు పెచ్చులూడి పడి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గాయాలవుతున్నాయి. పాఠశాలల్లో కరోనా రూల్స్​ కఠినంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి, ఆఫీసర్లు చెప్పారే గానీ ఎక్కడా అమలు కావడం లేదు. మెయింటనెన్స్ ​గ్రాంట్​ రాక ఏ స్కూల్​లోనూ హ్యాండ్​ వాష్, హ్యాండ్ ​శానిటైజర్స్ కొనే దుస్థితి లేదు. కనీసం సబ్బులను అందుబాటులో ఉంచట్లేదు. చాక్​పీస్​లు, రిజిస్టర్లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు అంటున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధమవుతుంది’ అని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలికి గాలికొదిలేశారని తనదైన శైలీలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 26,067 గవర్నమెంట్, లోకల్ ​బాడీ స్కూల్స్​ ఉన్నాయని, విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలైనా ప్రభుత్వం నుంచి గ్రాంట్​ ఇవ్వకుండా జాప్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఇక స్కూళ్లకిచ్చిన కరెంట్​ కనెక్షన్లు కమర్షియల్​ కేటగిరీ కింద చేర్చడంతో బిల్లులు భారీగా రావడం గ్రాంటు నిధులు విడుదల కాకుండా ఉండడంతో బకాయిలు పడ్డాయని ఆరోపించారు. కొన్నిచోట్ల బిల్లులు కట్టలేదని కనెక్షన్​ తొలగిస్తున్నా.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించే తీరు చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చిన్నచూపు కనబరుస్తుందో అర్ధమవుతుందన్నారు.

ఓట్ల కోసం ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పే ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భారీగా ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్… రాష్ట్రవ్యాప్తంగా ​28,200 మంది స్కావెంజర్లకు జీతాలు ఇవ్వలేక వారిని తొలగించి… స్కూళ్లలో పారిశుధ్య పనుల బాధ్యతను లోకల్​ బాడీలకు అప్పగించారని మండిపడ్డారు. పట్టణాలు, గ్రామాల్లోని పారిశుధ్య పనులే తలకు మించిన భారం కావడంతో మున్సిపల్​, పంచాయతీ శానిటరీ వర్కర్లు స్కూళ్ల దిక్కు చూడడమే లేదన్నారు.

రాష్ట్రంలో వేలకొద్ది టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తూ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. గతంలో పనిచేసిన విద్యావలంటీర్లను ప్రభుత్వం తొలగించడంతో ఇంకా దారుణమైన పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అశ్రద్దను వీడి, అన్ని సౌకర్యాలనూ కల్పించి, పేదవారికి విద్యను అందజేయాలని కోరారు.

Advertisement

Next Story