కరోనా కేసుల పర్యవేక్షణకు విజిలెన్స్ సెల్

by Sridhar Babu |   ( Updated:2021-04-21 04:13:37.0  )
Gangula Kamalakar
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసుల విషయంలో కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కేసులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మంగళవారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కరోనా పేషంట్ల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని సూచించారు. కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులు ఎంతమేర రెమిడిసివిర్ తీసుకున్నాయి, వాటిని ఎంతమంది పేషెంట్లకు వినియోగించారు అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రులు ఎమ్మార్పీ ధరలకే రెమిడెసివిర్ ఇంజక్షన్ పేషెంట్లకు సరఫరా చేయాలని, జిల్లాకు సరిపడా రెమిడెసివిర్ పంపించాలని మంత్రి ఈటెల రాజేందర్ ను కోరామని వివరించారు. రోజుకు వెయ్యి రెమిడెసివిర్ ఇంజక్షన్లు కరీంనగర్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో రెమిడెసివిర్ ఇంజక్షన్ రూ.20 వేలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. ఏ ఆస్పత్రికి ఎన్ని రెమిడెసివిర్ ఇంజక్షన్లు అవసరమో తెలుసుకుని రోజు వారిగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఇంజక్షన్లు ఏ పేషంట్ కు ఇస్తున్నారో కూడా పక్కగా పర్యవేక్షిస్తామని చెప్పారు.

ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందికి మానవత దృక్పథంతో సాయం

దిశ, కరీంనగర్ సిటీ : ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం చేస్తుంద‌ని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రైవేట్ స్కూళ్ల టీచ‌ర్లు, సిబ్బందికి పాఠ‌శాల‌లు పునఃప్రారంభించే వ‌ర‌కూ సహాయం అంద‌జేయాల‌ని నిర్ణయించిన ప్రకారం రూ. 2,000లు, 25 కేజీల సన్నబియ్యం పంపిణీని మంత్రి బుధవారం క‌రీంన‌గ‌ర్లో చైతన్యపూర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో లాంఛ‌నంగా ప్రారంభించారు.

Advertisement

Next Story