ఊపిరి పీల్చుకున్న నల్లగొండ !

by Shyam |
ఊపిరి పీల్చుకున్న నల్లగొండ !
X

– వియ‌త్నాం దేశస్తులకు కరోనా నెగటివ్

దిశ, న‌ల్ల‌గొండ‌: హమ్మయ్య..! వియ‌త్నాం నుంచి న‌ల్ల‌గొండలోని మ‌సీదుకు వ‌చ్చిన 14 మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నివేదిక‌లు రావ‌డంతో శుక్ర‌వారం ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌లు ఊపీరి పీల్చుకున్నారు. న‌ల్ల‌గొండ మ‌సీదుకు వియ‌త్నాం దేశ‌స్తులు వ‌చ్చిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో జిల్లాలో అల‌జ‌డి రేగిన విష‌యం విధిత‌మే. అయితే పోలీసులు, వైద్య ఆరోగ్య‌శాఖ సిబ్బంది వీరిని హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుప‌త్రికి తర‌లించి ప‌రీక్ష‌లు నిర్వహింఛి, వీరి శాంపిల్స్ సేక‌రించి పుణేకు పంపించారు. అనంతరం న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఐసోలేష‌న్‌కు త‌ర‌లించారు. కాగా, వారికి ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని నిర్ధారిస్తూ.. నివేదిక‌లు రావ‌డంతో శుక్ర‌వారం డిశ్చార్జి చేశారు. అలాగే విదేశాల నుంచి వ‌చ్చిన 608 మందికి కూడా ఎలాంటి ల‌క్ష‌ణాలు బ‌య‌టప‌డ‌లేదు. కొంత మంది అనుమానితుల‌ను గుర్తించి పరీక్షించగా వారికి కూడా నెగ‌టివ్ రిపోర్టు వ‌చ్చింది. తెలంగాణలో క‌రోనా విజృంభించిన ఈ 28 రోజుల్లో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ప్రకటించారు.

అనుమానితుల‌కు క‌రోనా నిల్ !

న‌ల్ల‌గొండ పట్ట‌ణ శివారులోని ఓ మ‌సీదులో ప్రార్థన‌లు, మ‌త బోధ‌న‌లు చేసేందుకు 14 మంది వియత్నాం దేశం నుంచి వ‌చ్చారు. వీరి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉండ‌టంతో అక్క‌డి వైద్యులు తిరిగి న‌ల్ల‌గొండ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అధికారులు మాత్రం ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు. వారి ర‌క్త‌ప‌రీక్ష‌ల నివేదిక‌ల్లో క‌రోనా లేద‌ని తేలింది. ఆ త‌రువాత నల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి ఆసుప‌త్రికి వెళ్లి వారిని ప‌రామర్శించ‌డంతో వారిని న‌ల్ల‌గొండ‌కు తీసుకొచ్చిన విష‌యం తెలిసి జ‌నాలు భయపడ్డారు. న‌ల్ల‌గొండ వ‌న్‌టౌన్‌లో ఉన్న ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియా గ్రూపుల్లో వ‌దంతుల‌ను రేకెత్తించే విధంగా పోస్టులు చేయ‌డం వ‌ల్ల జ‌నాల భ‌యం మ‌రింత పెరిగిపోయింది. అయితే జ‌నాల భ‌యం పోగొట్టేందుకు వైద్య అధికారులు వారి నెగ‌టివ్ రిపోర్టును బ‌య‌ట‌కు రిలీజ్ చేయ‌డంతో న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌లు ఊపీరి పీల్చుకున్నారు.

న‌ల్ల‌గొండ జిల్లాలోని పాల‌కీడు వ‌ద్ద‌ సిమెంట్ కంపెనీలో ప‌ని చేయ‌డానికి వ‌చ్చిన బీహార్ కార్మికులు ఆరుగురు ఐదు రోజుల క్రితం ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం లక్షణాలు ఉండటంతో అనుమానించి గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వీరికి ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా నెగటివ్ వచ్చిన‌ట్టు స్థానిక వైద్యులు చెప్పారు. అలాగే దుబాయి నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు విద్యార్థుల‌కు సైతం క‌రోనా లేద‌ని నిర్ధార‌ణ జ‌రిగిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. అయితే వారు కిడ్నీ స‌మ‌స్య‌తో బాధా ప‌డుతున్న‌ట్టు వైద్యులు వెల్ల‌డించార‌ని స్థానిక ఏరియా ఆసుప‌త్రి డాక్ట‌ర్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను కరోనా వదంతులు వణికిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి చిరునామా తెలిస్తే వెంటనే హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తున్నారు. సూర్యాపేట క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్‌కు ఇప్పటి వ‌ర‌కు 29 ఫిర్యాదులు అందాయి. ప్ర‌జ‌లు ఇచ్చిన స‌మాచారంతో విదేశాల నుంచి వ‌చ్చిన వీరిని ఇమాంపేట‌లోని మోడ‌ల్ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అలాగే భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని ప‌హ‌డి న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఇటీవ‌లే దుబాయ్ నుంచి వ‌చ్చాడు. స్థానికంగా ఉంటే విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆర్‌బీ న‌గ‌ర్‌లో అద్దె ఇల్లు తీసుకొని ఉన్నాడు. ఇంట్లో అద్దెకు వ‌చ్చిన రెండు రోజుల‌కే ఆయ‌న‌కు సుస్తీ కావ‌డంతో హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయ‌గా పోలీసులు వ‌చ్చి విచారించడంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వెంట‌నే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అతడిని గాంధీ ఆసుపత్రికి త‌ర‌లించారు. విదేశాల నుంచి వచ్చిన 608 మందిలో.. ప్ర‌స్తుతం న‌ల్ల‌గొండ‌లో 352, భువ‌న‌గిరిలో 96, సూర్యాపేట‌లో 167 మంది ఉండ‌గా.. హోం క్వారంటైన్‌లో 313 మంది వైద్య ఆరోగ్య‌శాఖ స‌ర్విలైన్స్ టీమ్ నిఘాలో ఉన్నారు.

ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవలకు వైద్య బృందాలు..

జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆసుప‌త్రుల్లో కరోనా వైద్యసేవలందించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ప్ర‌త్యేక ఐసోలేష‌న్ వార్డుల‌ను ప్రారంభించారు. సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ ఐసోలేష‌న్ సెంట‌ర్స్‌లో రోగుల‌కు చికిత్స‌లు అందిస్తున్నారు. అయితే రోజూ తామే ఐసొలేషన్‌ వార్డుకు వెళ్లి చికిత్సలందించాల్సి రావడంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో క‌లెక్ట‌ర్ల సూచ‌న మేర‌కు డీఎంహెచ్‌వోలు ఆలోచించి ఎమర్జెన్సీ వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో వైద్యులు, ల్యాబ్‌, ఎక్స్‌రే టెక్నీషియన్లు, ఇతర నర్సులు మూడు రోజులకోసారి డ్యూటీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

Tags : Nalgonda, Corona, Isolation centre, Home quarantine, Vietnam Nationals, negative

Advertisement

Next Story

Most Viewed