ఇల్లు గుల్లచేస్తున్న వీడియో గేములు!

by Shyam |
ఇల్లు గుల్లచేస్తున్న వీడియో గేములు!
X

అసలే కష్టకాలం.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ పిల్లలు, విద్యార్థులు స్కూళ్లు లేక, పరీక్షలు రద్దై కొద్దిగా సంతోషకరమైన మూడ్‌లో ఉన్నారు. ఇలాంటి సమయాల్లో వారు చేయగలిగింది ఏంటి.. స్మార్ట్‌ఫోన్‌ వాడటం మాత్రమే. ఇంకా 18 ఏళ్లు నిండలేదు కాబట్టి సోషల్ మీడియా మీద విపరీతమైన ఆసక్తి ఉండదు. కొద్దో గొప్పో ఉన్న ఆసక్తి ఓ రెండు సార్లు ఓపెన్ చేసి ఫీడ్ చూశాక మాయమవుతుంది. ఇక మిగిలింది ఏమిటి? వీడియో గేములు. ఆన్‌లైన్‌లో తోటి మిత్రులతో ఆడటంలో వచ్చే మజానే వేరు. అందుకే లాక్‌డౌన్ సమయంలో ఈ వీడియోగేమ్ ఇండస్ట్రీ రెండింతలు ఎదిగింది. అయితే రోజూ ఒకే రకమైన వీడియో గేమ్‌ను స్నేహితులతో కలిసి ఆడితే బోర్ కొడుతుంది. అందుకే కంపెనీలు కొత్త కొత్త ఏరెనాలను, ఆటలో ఉపయోగపడే వస్తువులను విడుదల చేస్తుంటాయి. అయితే సమస్య మొత్తం ఇప్పుడు ఈ కొత్తగా విడుదలచేస్తున్న టూల్స్ వల్లనే వచ్చింది. ఎలాగంటారా?

వీడియో గేముల్లో లెవల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. అయితే ఒక్కొక్క లెవల్‌లో ఒక్కో రకం ఆయుధాన్ని వాడాలి. ఆ నిర్దేశిత ఆయుధాన్ని వాడినపుడే ఆ లెవల్‌లో విజయం సాధించగలుగుతారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్‌లో తుపాకులు, గ్రనేడ్లు, హెల్త్ కిట్లు వంటివి ప్లేయర్ దగ్గర ఎక్కువ మొత్తంలో ఉన్నపుడు సులభంగా అందర్నీ ఓడించి విజయం సాధించగలుగుతారు. అయితే ఇలాంటి ఉపకరణాలు వీడియోగేమ్‌లో ఉచితంగా దొరకవు. వాటిని కొనాలంటే డబ్బు చెల్లించాలి. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతుంది. పిల్లల దగ్గర డబ్బులు ఉండవు. కానీ వారు ఆడే ఫోన్‌లో పెద్దవాళ్లకు సంబంధించిన బ్యాంక్ యాప్స్, ఖాతాల యాక్సెస్ ఉంటుంది.

ఎలాగూ తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డులు, యూపీఐ పాస్‌వర్డులు క్రాక్ చేయడం పిల్లలకు పెద్ద కష్టమేమీ కాదు. దీంతో గేమ్స్‌లో వస్తువులను కొనడానికి అన్నింటికీ ఓకే కొడతారు. ఇలా ఓకే కొట్టేటపుడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు. కొన్ని వీడియో గేమ్స్‌కు ఒకసారి బ్యాంక్ ఖాతా యాక్సెస్ ఇచ్చిన తర్వాత, మరోసారి ఎప్పుడైనా అవసరమైతే పాస్‌వర్డ్ కొట్టనక్కర్లేకుండా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. మొదటిసారి అత్యవసర వస్తువుల కోసం పిల్లలు బ్యాంక్ ఖాతా యాక్సెస్ ఇస్తారు. తర్వాత నుంచి వస్తువులను కొనేటపుడు ఓకే నొక్కగానే అవి అందుబాటులోకి వస్తాయి. కానీ బ్యాంకులో డబ్బు కట్టవుతున్న విషయం మాత్రం పిల్లలకు తెలియదు. ఇలా కాకుండా కావాలని డబ్బులు చెల్లించే పిల్లలు కూడా ఉన్నారనుకోండి. అది వేరే విషయం.

తెలిసి చేస్తున్న పిల్లలకు ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టాలో ఒక అంచనా ఉంటుంది. కానీ తెలియక చేస్తున్న పిల్లల వల్ల డబ్బులు లెక్కఉండదు. ఖాతాలో డబ్బులన్నీ పోయేవరకు ఆ విషయం తెలియదు. ఈ మధ్య ఒక అబ్బాయి 16 లక్షల రూపాయలు పోగొడితే అతన్ని బైక్ రిపేర్ షాపులో పనికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఇవి తెలియక పోయిన డబ్బులకు ఉదాహరణ. ఇక పంజాబ్‌లో ఓ 15 ఏళ్ల బాలుడు తన తాతయ్య దాచుకున్న పెన్షన్ డబ్బులు రూ. 2 లక్షలను పబ్జీ ఆటలో ఖర్చుపెట్టాడు. ఇది తెలిసి చేసిన పని. కాబట్టి ఇక్కడ పిల్లలకు ఫోన్లు ఇచ్చే ముందే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న ఆర్థికంగా ఇబ్బందులకు ఇది తోడైతే, పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అందుకే ఇంట్లో గేమ్స్ ఎక్కువగా ఆడే పిల్లలు ఉంటే, ఒకసారి మీ ఆర్థిక పరిస్థితిని వివరించి, తెలిసి తెలిసి డబ్బులు ఖర్చుపెట్టొద్దని చెప్పండి. అంతేకాకుండా ఫోన్లలో బ్యాంక్ యూపీఐ యాప్‌లు తీసేయడం, పాస్‌వర్డులు మార్చడం తరచుగా చేయడం ద్వారా ఇలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed