సీనియర్ జర్నలిస్టు మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం !

by Shyam |
సీనియర్ జర్నలిస్టు మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం !
X

దిశ, న్యూస్ బ్యూరో :
చెన్నైలో తెలుగు టీవీ ఛానెల్‌ నందు పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు పూండ్ల శ్రీనివాస్ సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈటీవీ వార్తా ప్రసారాలను మొదలుపెట్టినప్పటి నుంచి శ్రీనివాస్ ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. తొలుత వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా సంస్థలో ప్రస్తానాన్ని మొదలుపెట్టిన శ్రీనివాస్.. అవసరార్థం ఈనాడు దినపత్రికకు చెన్నై నగరంలోనే కొంతకాలం పాత్రికేయుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఈటీవీలోకి మారారు. సుదీర్ఘకాలం పాటు చెన్నైలోనే పనిచేసిన ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. గత నెలలో ఆఫీసులో విధులు ముగించుకుని బయటకువచ్చిన తర్వాత రోడ్డు మీద కుక్కను తరిమే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడ్డారు. చిన్నగాయమే కదా అని పట్టించుకోకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. కానీ, నెల రోజుల తర్వాత అది విషమించడంతో ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయారు.

శ్రీనివాస్‌ మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా విచారం వ్యక్తంచేశారు. ‘వృత్తిపట్ల నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం ఆయన్ని ఆదర్శ పాత్రికేయుడిగా నిలిపాయి. ఆయన వ్యక్తిగతంగా నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..!’ అని ట్వీట్‌ చేశారు. తమిళనాడు రాజకీయాలపైనా, ఆ రాష్ట్రంలో స్థిరపడిన తెలుగువారికి సంబంధించిన అనేక అంశాలపై లోతైన అవగాహన కలిగిన శ్రీనివాస్ చాలామంది తెలుగు ప్రముఖులకు చిరపరిచితుడు.

Tags: Reporter, Srinivas, Death, Rabies, Chennai, Hyderabad, Vice President, Venkaiah Naidu

Advertisement

Next Story