వీర బ్రహ్మేంద్ర స్వామి వాక్కు నిజమా?.. దేవుడికి కరోనా సోకిందా?

by srinivas |
వీర బ్రహ్మేంద్ర స్వామి వాక్కు నిజమా?.. దేవుడికి కరోనా సోకిందా?
X

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మూతపడుతుందా? చరిత్రలో ఏనాడూ జరగని అపచారం ఇప్పుడు చోటుచేసుకోబోతోందా?.. అంత్య దశలో ఆలయం మూతపడుతుందంటూ భవిష్యద్దర్శకుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రవచించిన వాక్కు నిజమవుతుందా?.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే.. నిజమని అనిపించకమానదు. ఇంతకీ ఏం జరుగుతుందన్న వివరాల్లోకి వెళ్తే…

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించింది. కరోనా ప్రభావం తెలిసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కరోనాను ఆపలేకపోయారు. విదేశాల నుంచి కరోనా వచ్చేసింది. ఇప్పుడు నెమ్మదిగా దాని పరిధిని విస్తరించుకుంటోంది. రోజూ ఒకటో రెండో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా ప్రభావితదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారి సంఖ్య పెరగడంతో దాని ప్రభావం మరింతగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో కరోనా ప్రభావం తిరుమల గిరులను తాకింది. కరోనా నుంచి స్వామి వారి భక్తులను రక్షించేందుకు పలు సూచనలు చేస్తూ, వివిధ మార్పులు చేపట్టారు. శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానానికి అనుమతి లేదు. ఆ నీటితో 18 బాత్రూమ్‌లలో పైపులు ఏర్పాటు చేసి, పుణ్యస్నానికి ఏర్పాట్లు చేశారు. అలాగే క్యూలైన్లలో దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల చేరుకోవడంలో ఆంక్షలున్నాయి. దర్శనాల టికెట్ల విక్రయం తగ్గించారు. దీంతో ఎప్పుడూ గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల గిరులు కీచుమంటున్నాయి.

కరోనా ప్రభావం పెరిగితే ఆలయ నిర్వహణపై మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి విషమిస్తున్నదని భావిస్తే, స్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసే సదుపాయం ఉన్నదని అన్నారు. శతాబ్దాల క్రితమే పండితులు నిర్ధారించిన ఆగమ శాస్త్రంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, అన్ని కైంకర్యాలనూ ఏకాంతంగా నిర్వహించే వీలుందని వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని సార్లు, కొన్ని కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా విజృంభిస్తే, కొన్ని రోజుల పాటు ఆలయంలోకి భక్తులు రాకుండా నిరోధించవచ్చని అన్నారు.

ఈ వ్యాఖ్యలు గతంలో బ్రహ్మజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన వాక్కులను గుర్తుతెస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలియుగంలో.. అధర్మం, అవినీతి పెచ్చరిల్లిన సందర్భంలో, మానవత్వం మృగ్యమైన రోజుల్లో తిరుమల దేవాలయాన్ని మూడు రోజులు మూసి ఉంచుతారని ఆయన పేర్కొన్నారని గుర్తు చేసుకుంటున్నారు. అంటే అంతిమ ఘడియల్లో (లోకాంత్య దినాల్లో) ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. శతాబ్దాల చరిత్ర గలిగిన టీటీడీ చరిత్రలో ఆలయాన్ని మూసిన సందర్భమేదీ లేదు. కరోనా కారణంగా మూసివేస్తే దానిని ఉత్పాతానికి సంకేతంగా భావించవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

శ్రీశైల క్షేత్రంలో శారదా పీఠం నిర్వహిస్తున్న యజ్ఞయాగాదుల కారణంగా ఆలయం ప్రవేశం నిషిద్ధమని ప్రకటించారు. మరోవైపు చిలుకూరి బాలాజీ టెంపుల్ మూసేస్తున్నట్టు ఆలయ అర్చకులు ప్రకటించారు. ఉగాది పంచాంగ శ్రవణాన్ని రద్దు చేశారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల్లో శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణ అసాధ్యంగా మారింది. ఇంకోవైపు షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా దేవాలయాలన్నీ కరోనా భయంతో వణికిపోతున్నాయి.

Tags: temples, ttd, sri venkateswara swamy temple, chilkur balaji temple, ugadi, sri ramanavami, shirdi saibaba temple

Advertisement

Next Story

Most Viewed