తెలంగాణలో వింత పరిస్థితి.. వ్యాక్సిన్ ఉన్నా వేయట్లేదు..

by Anukaran |   ( Updated:2021-05-17 07:57:49.0  )
తెలంగాణలో వింత పరిస్థితి.. వ్యాక్సిన్ ఉన్నా వేయట్లేదు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ విచిత్రమైన పరిస్థితుల్లో పూర్తిగా నిలిచి పోయింది. వ్యాక్సిన్ సరఫరా లేదని కొన్ని రోజులు, స్టాక్ అందుబాటులోకి వచ్చిన అనంతరం కూడా పలు రకాల కారణాలతో వ్యాక్సిన్ వేయడం లేదు. ఈ నెల 15వ తేదీన నిలిచిపోయిన వ్యాక్సిన్ 17వ తేదీ వరకు కూడా అందుబాటులోకి రాలేదు. తిరిగి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారనే విషయంలో కూడా అధికారుల్లో స్పష్టత లేదు. దీంతో 45 సంవత్సరాలు పై బడిన వారు తీవ్ర మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. కొవిషీల్డ్‌ తొలి, రెండో డోస్‌ మధ్య వ్యవధిలో కేంద్రం మార్పులు చేసిన నేపథ్యంలో వ్యాక్సిన్ నిలిచి పోయిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కరోనా కేసులు, మరణాలు ఆందోళన కల్గిస్తుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మొదటి నుండి ఇబ్బందులే..

కరోనా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దేశంలో రెండు రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి కొవాగ్జిన్ కాగా మరొకటి కొవిషీల్డ్. ఈ రెండు వ్యాక్సిన్‌లనే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అయితే తెలంగాణలో వ్యాక్సిన్ వేయడంలో మొదటి నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని రోజులు వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోవడం, వచ్చిన అనంతరం కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అని ఒకసారి, రెండవ విడత వారికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు నేరుగా వేస్తామని మరోసారి ప్రకటించడం ద్వారా ప్రజలు అయోమయానికి గురవతున్నారు. ఎప్పుడు, ఎలా వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లి టీకా తీసుకోవాలో అర్థం కాని తీరులో ఉన్నారు. వారి సందేహాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 18 నుండి 44 సంవత్సరాల మధ్య గ్రూప్ వయస్సు వారు కూడా టీకా వేసుకునే సందర్భం తమకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఒకటి లేదు.. ఇంకోటి ఉన్నా వేయరు..

రాష్ట్రంలో కొవాగ్జిన్ టీకా అందుబాటులో లేని కారణంగా నిలిచిపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కొవిషీల్డ్ మార్గదర్శకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. మొదటి విడత టీకాకు రెండవ విడత టీకాకు కనీసం 12-16 వారాల గడువు ఉండాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిషీల్డ్ రెండవ విడత వ్యాక్సిన్ వేసుకునే వారిలో అర్హులే లేకుండా పోయారు. రాష్ట్రంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ స్టాక్ ఉన్నా కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల కారణంగా రెండవ విడతకు అర్హులు లేరని వ్యాక్సిన్ అందించడం లేదని చెప్పి అధికారులు సెంటర్లను మూసి వేశారు. కొవాగ్జిన్ నిల్వలు లేకపోగా అందుబాటులో ఉన్న కొవిషీల్డ్ మాత్రం అర్హులు లేని కారణంగా నిలిచిపోయింది.

మూన్నాళ్ల ముచ్చటగా ప్రజల సంతోషం..

ఈ నెల 11వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో 20 గంటల లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకునేవారు ఎలాంటి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా నేరుగా సమీపంలోని సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. వారి సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కేంద్రం సవరించిన మార్గదర్శకాల పేరుతో ఒకటి, స్టాక్ లేని కారణంగా మరొకటి నిలిచిపోవడంతో టీకా కోసం ఎదురు చూస్తున్నవారు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed