అమర జవాన్లకు అమెరికా సంతాపం

by vinod kumar |
అమర జవాన్లకు అమెరికా సంతాపం
X

వాషింగ్టన్‌: గాల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీతో పోరాడి వీరమరణం పొందిన భారత సైనికులకు అమెరికా సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్ పాంపియో సంతాపం వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో గాయాలపాలైన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎల్‌ఏసీ వద్ద జరిగిన పోరులో అసువులు బాసిన భారత సైన్యానికి మా సంతాపం తెలుపడమే కాకుండా, వారి కుటుంబాలను మేం గుర్తుంచుకుంటాము” అని ట్విట్టర్ ద్వారా పాంపియో స్పందించారు. చైనా దుశ్చర్యలను అమెరికా ఎన్నటికీ సహించబోదని ఖండించారు.యావత్ ప్రపంచం కరోనాపై పోరాటం చేస్తుంటే డ్రాగన్ కంట్రీ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారి డేవిడ్‌ స్టిల్‌వెల్‌ ఆరోపించారు. చైనా దుశ్చర్యలను ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. గతంలోనూ డోక్లామ్‌ సరిహద్దు వివాదాన్ని జరిగిన విషయాన్ని స్టిల్‌వెల్‌ గుర్తు చేశారు. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్ఏ)ఈ సారి భారత భూభాగంలోకి చాలా మేర చొచ్చుకెళ్లిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సైన్యాన్ని ఎక్కువగా మోహరించారని చెప్పారు. చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగుతోందని అభిప్రాయపడ్డారు. కరోనా వివరాల వెల్లడిలోనూ చైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఇండియా– చైనా బార్డర్‌‌లోని గాల్వాన్‌ వ్యాలీలో జరిగిన గొడవల్లో మన దేశానికి చెందిన 20 మంది జవాన్లు అమరులవ్వగా, చైనాకు చెందిన 43మంది సైనికులు చనిపోయి ఉంటారని తెలుస్తున్నప్పటికీ, చైనా అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Next Story

Most Viewed