యోగి రోడ్ షో.. పాతబస్తీలో టెన్షన్ టెన్షన్ !

by Shyam |   ( Updated:2020-11-25 01:58:06.0  )
యోగి రోడ్ షో.. పాతబస్తీలో టెన్షన్ టెన్షన్ !
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాతబస్తీ పాకిస్తాన్‌లో ఉందా అని టీఆర్ఎస్ అంటూ ఉంటే, పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అంటోంది. రెండు పార్టీలూ పాత బస్తీపై మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అక్కడే రోడ్ షో నిర్వహించేలా బీజేపీ వ్యూహం రచించింది. మజ్లిస్‌కు కంచుకోటగా ఉన్న పాతబస్తీలో యోగితో మీటింగ్ పెట్టించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం కార్యక్రమాన్ని ఖరారు చేసింది. ఈనెల 27న అందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. పాతబస్తీలో ఏ ప్రాంతంలో యోగితో రోడ్ షో పెట్టిస్తే బాగుంటుందనేదానిపై రాష్ట్ర బీజేపీ నేతలు సరైన వేదిక కోసం ఆలోచనలు చేస్తున్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని వేదికగా చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. అయితే ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ నగరానికి సంబంధించినదే అయినా హిందు-ముస్లిం అంశం ప్రధానంగా తెరమీదకు రావడంతో యోగి ఆదిత్యనాధ్ పాత బస్తీలో చేసే పర్యటన సందర్భంగా బాంబుల్లాంటి పంచ్ డైలాగులు రాజకీయ వాతావరణాన్ని ఏ దిశగా మలుపు తిప్పుతాయన్నది పోలీసులకు సవాలుగా మారింది. హిందూ ఓటర్లను ఆకర్షించడానికి యోగి సమావేశం అద్భుతంగా ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తుండగా ముస్లింలంతా మరో డైరెక్షన్ తీసుకుంటారేమోనని టీఆర్ఎస్ ఆందోళన పడుతోంది. రెండు మతాల ఓటర్లు రెండువైపులా చీలిపోతే అటు మజ్లిస్, ఇటు బీజేపీ లబ్ధి పొంది మధ్యలో ఉన్న టీఆర్ఎస్, ఇతర పార్టీలు జీరో అయిపోతాయన్న చర్చలూ జరుగుతున్నాయి.

రాజకీయ ఎత్తుగడలు ఇలా ఉండగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవడం పోలీసులకు అగ్నిపరీక్షగా మారనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లతోనే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఊహించని మలుపు తీసుకోగా ఇప్పుడు యూపీ సీఎం యోగి మాటలతో సరికొత్త టర్న్ తీసుకుంటాయనే చర్చలూ మొదలయ్యాయి. సరిగ్గా బీజేపీ కోరుకుంటున్నది ఇదే. హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగరం, పాత బస్తీ వర్సెస్ మిగిలిన బస్తీలు అనే కాన్సెప్ట్ తెరమీదకు వచ్చిన సమయంలో యోగి పెట్టే రోడ్ షో, అక్కడ ఆయన పేల్చే మాటల తూటాలపైనే ఇప్పుడు బీజేపీ శ్రేణులు, ఆ పార్టీవైపు ఉన్న ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed