Unemployment: వణికిస్తున్న నిరుద్యోగం.. వాటికోసం ఉన్న ఉద్యోగాలను కూడా పణంగా పెడుతూ

by Anukaran |   ( Updated:2021-09-04 23:12:33.0  )
Unemployment: వణికిస్తున్న నిరుద్యోగం.. వాటికోసం ఉన్న ఉద్యోగాలను కూడా పణంగా పెడుతూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకీ నిరుద్యోగం పెరుగుతోంది. ఈ నెలలో ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయిన వారి సంఖ్య పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగత శాతం 8.2 ఉంటే.. రాష్ట్రంలో 4.7 శాతంగా నమోదైంది. పట్టణాల్లోని సాంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి శాచురేషన్‌ పాయింట్‌కు చేరుకోవడంతో నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భూతం మరింత ఎక్కువగా భయపెడుతోంది.

పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే నిరుద్యోగమున్నా అక్కడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం, గ్రామాల్లో 7.5 శాతం నిరుద్యోగం రికార్డయింది. ముఖ్యంగా నగరాల్లో ప్రతి పది మందిలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది డిసెంబర్​లో ప్రభుత్వం 50వేల ఉద్యోగాలను భర్తీచేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మనదగ్గర నిరుద్యోగత శాతం ఒక్కసారిగా పెరుగింది. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్న ఉద్యోగాలను వదులుకున్నట్లు సీఎంఐఈ లెక్కల్లో స్పష్టమవుతున్నాయి.

గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఘోరం..

రాష్ట్రంలో నిరుద్యోగుల్లో పట్టభద్రులు ముందున్నారు. సీఎంఐఈ లెక్కల ప్రకారం చదువులేని వారు ఖాళీగా ఉండటం లేదు. ఏదో పనిలో నిమగ్నమయ్యారు. ఇక 5వ తరగతిలోగా చదివిన వారిలో నిరుద్యోగత 1.12 శాతంగా ఉంటే 6 నుంచి 9వ తరగతి వరకు చదివిన వారిలో 0.67 శాతంగా ఉంది. 10 నుంచి 12 వరకు చదివిన వారు నిరుద్యోగంలో 0.80 శాతంగా ఉన్నారు. కానీ పట్టభద్రులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని ఏ ఉద్యోగాలు చేయడం లేదు. దీంతో పట్టభద్రులు 26.35 శాతం మంది ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగత రేటులో పట్టణ ప్రాంతాల్లో 5.2 శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4 శాతంగా నమోదైంది. ఇక వీరిలో మహిళల శాతం 1.7 గా ఉంటే.. పురుషులది మాత్రం 5.7శాతంగా ఉంది. అయితే 29నుంచి 39ఏండ్ల మధ్య వయసున్న వారిలోనే నిరుద్యోగం పెరుగుతోంది.

ఈ మూడు నెలలు దారుణం..

ఈ మూడు నెలల కాలంలో ఉద్యోగాలు కొల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జూన్​లో 4.8 శాతం మంది ఉద్యోగాలకు దూరమైతే.. జూలైలో 4.0 శాతం.. ఆగస్టులో మాత్రం ఇది 4.7 శాతానికి పెరిగింది. చాలా వ్యాపారాల్లో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగం రేటు భారీగా పెరిగింది. ఈ నెల 3 వరకు నిరుద్యోగుల అంశాలపై లెక్కలు వెల్లడించారు.

34 లక్షల మంది కొలువులు పోయాయి..

రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి 34.3 లక్షల మంది​ ఎంప్లాయిస్​ కొలువులకు దూరమైనట్లు నివేదికల్లో పేర్కొన్నారు. కొన్ని భారీ పరిశ్రమలు, ఉద్యోగులను ఇంటింకి పంపగా.. మరికొన్ని మాత్రం తగ్గించుకున్నాయి. మధ్య తరహ పరిశ్రమలు రాష్ట్రం మొత్తంగా 974 మూతపడ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ కొలువుల కోసం వెయిటింగ్​..

మరోవైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులను ఆశిస్తూ ప్రైవేట్​ ఉద్యోగాలను వదిలేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. అందుకే గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం పెరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అదే కొనసాగుతూ వస్తోంది. గత ఏడాది సెప్టెంబర్​లో 3.3 శాతంగా నిరుద్యోగులు నమోదయ్యారు. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్​లో 2.9 శాతం, నవంబర్​లో 1.6 శాతం నిరుద్యోగులున్నారు. కానీ గత ఏడాది డిసెంబర్​లో రాష్ట్రంలో 50 వేల కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రులు ఉన్న ఉద్యోగాలను వదులుకున్నారు. సర్కారు కొలువుల కోసం మళ్లీ పుస్తకాలు పట్టుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్​లో 7.0 శాతం నిరుద్యోగులు నమోదయ్యారు. ఆ తర్వాత సగటున 5 శాతంగా కొనసాగుతూ వస్తున్నారు.

ఈ ఏడాది నిరుద్యోగత ఇలా..

నెల: శాతం

జనవరి: 4.3

ఫిబ్రవరి: 5.6

మార్చి :3.7

ఏప్రిల్​ :5.0

మే :7.2

జూన్:​ 4.8

జూలై :4.0

ఆగస్టు :4.7

దేశ స్థాయిలో

సెప్టెంబర్​ 3 వరకు..

దేశ సగటు 8.2 శాతం

పట్టణ ప్రాంతాలు 9.8 శాతం

గ్రామీణ ప్రాంతాలు 7.5 శాతం

Advertisement

Next Story