జగన్ కూడా అలాంటి తప్పే చేస్తున్నారు: ఉండవల్లి

by srinivas |
జగన్ కూడా అలాంటి తప్పే చేస్తున్నారు: ఉండవల్లి
X

పీ తాజా పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు, జగన్ దృష్టిలో రాజధాని అంటే ఓ పెద్ద నగరమని అభిప్రాయపడ్డారు. ఏ కారణం వల్ల ఏపీ, తెలంగాణ విడిపోయాయో ఇప్పుడు జగన్ కూడా అలాంటి తప్పే చేస్తున్నారని విమర్శించారు. పెద్ద నగరం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావించాడని, ఇప్పుడు జగన్ కూడా అదే అభిప్రాయంతో ముందుకు పోతున్నాడని ఆరోపించారు. రాబోయే పదేళ్లలో ఎవరూ హైదరాబాద్, బెంగళూరు వెళ్లే అవసరం లేకుండా విశాఖను అభివృద్ధి చేస్తామనడమంటే.. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి అంతటినీ ఒకే చోట కేంద్రీకరణ చేస్తున్నట్టేనని అన్నారు. ఈ వ్యవహారంలో పంజాబ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, అక్కడ పెద్ద నగరం అంటూ ఏమీ ఉండదని, అన్నీ ద్వితీయశ్రేణి నగరాలే కనిపిస్తాయని తెలిపారు. కానీ అక్కడి జనాభాలో 60 శాతం మంది ధనికులే ఉంటారని వెల్లడించారు.

ఇక అమరావతి అంశంపై కూడా ఉండవల్లి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రైతులది త్యాగం కాదని, గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రణాళికకు ఒప్పుకుని భూములు ఇచ్చారని తెలిపారు. అమరావతి పెద్ద సిటీగా మారితే తమకు భారీగా డబ్బులొస్తాయనే భూములు ఇచ్చారని వివరించారు. రైతులు త్యాగం చేశారని చంద్రబాబు అంటున్నారని, త్యాగం చేసినవాళ్లు డబ్బులు ఆశించకూడదు కదా అంటూ తర్కం ప్రదర్శించారు. జగన్ రాజధాని అంశం కంటే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే శ్రద్ధ చూపించాలని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed